అన్నవరం ఆలయంలో ప్రత్యేక పూజలు.. నేడు చంద్రబాబును ములాఖత్‌లో కలవనున్న భువనేశ్వరి, బ్రాహ్మణి
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబును జైలుకు తరలించినప్పటీ నుంచి.. ఆయన సతీమణి భువనేశ్వరి, కోడల బ్రాహ్మణి, ఇతర కుటుంబ సభ్యులు కొందరు రాజమండ్రిలోనే బస చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నారా భువనేశ్వరి ఈరోజు అన్నవరంలోని సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి అన్నవరం ఆలయానికి వెళ్లిన భువనేశ్వరి.. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భువనేశ్వరికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. ఇక, భువనేశ్వరి వెంట పలువురు టీడీపీ నేతలు కూడా ఉన్నారు.
ఇదిలా ఉంటే.. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా జగ్గంపేటలో జరుగుతున్న దీక్షా శిబిరానికి వెళ్లనున్నారు. మరోవైపు బ్రాహ్మణి మాత్రం రాజమండ్రి క్యాంప్ సైట్‌లోనే ఉన్నారు.
నేడు చంద్రబాబుతో ములాఖత్..
రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మణి, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈరోజు ములాఖత్ కానున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు వీరు చంద్రబాబుతో ములాఖత్ అయ్యేందుకు జైలు అధికారులు అనుమతించినట్టుగా టీడీపీ వర్గాలు తెలిపాయి.