అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధికి ఐకాన్ అని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అభివర్ణించారు. గండిపేటలోని ఎన్టీఆర్ మోడల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తో కలిసి పాల్గొన్న భువనేశ్వరి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నారని తెలిపారు. 

నీతినిజాయితీగా రాష్ట్రాన్ని పాలిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు అహర్నిశలు రాష్ట్రప్రజల కోసం ఆలోచిస్తుంటే కొంతమంది పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు సైలెంట్ గా ఉన్నా విపక్షాలు వాయిలెన్స్ చేస్తున్నాయని ఆరోపించారు. 

నిత్యం ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పరితపిస్తారని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు. మరోవైపు పేదలకు రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పిందే ఎన్టీఆరేనని సీఎం చంద్రబాబు తెలిపారు. 

తాను నిత్య విద్యార్థినని నిత్యం కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటానని చెప్పుకొచ్చారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఆన్‌లైన్ ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. తెలుగుజాతి భవిష్యత్ కోసమే సైబరాబాద్‌ను నిర్మించానని తెలిపారు. పార్టీ కోసం పనిచేసేవారి పిల్లల కోసం ఎన్టీఆర్ స్కూల్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. 

ప్రస్తుతం పేద విద్యార్థులు కూడా చదువుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ మోడల్ స్కూల్‌ను భువనేశ్వరి భవిష్యత్‌లో వర్సిటీ స్థాయికి తీసుకెళ్తుందన్న నమ్మకం ఉందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే హెరిటేజ్ ను ఎంతో స్థాయికి తీసుకువెళ్లారని ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ను కూడా అదేస్థాయిలో తీసుకెళ్తారని చంద్రబాబు స్పష్టం చేశారు.