Asianet News TeluguAsianet News Telugu

కుప్పంపై చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఫోకస్.. ఆ పరిణామాలతోనేనని చర్చ..!!

ఆంధ్రప్రదేశ్‌లో కుప్పం నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కంచుకోటగా ఉన్న సంగతి తెలిసిందే.

Nara bhuvaneshwari focus on kuppam for victory of her husband chandrababu Naidu Ksm
Author
First Published Aug 30, 2023, 1:43 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో కుప్పం నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కంచుకోటగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఈ సారి అంతకన్నా ఎక్కువ మెజారిటీ సాధించాలనే లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తుంది. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్.. వై నాట్ 175 అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్న జగన్.. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్‌ పెట్టారు. 

ఈసారి ఎలాగైనా కుప్పం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కుప్పం నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న భరత్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడంతో పాటు.. రానున్న ఎన్నికల్లో ఆయనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిని కూడా చేస్తానని చెప్పారు. అదే సమయంలో కుప్పం నియోజకవర్గానికి కూడా భారీగా నిధులు కేటాయించారు. సీఎం జగన్ ఆదేశాలతోనే కుప్పంపై  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. మంత్రి  పెద్దిరెడ్డి తరుచూ కుప్పంలో పర్యటిస్తూ రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా వైసీపీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా తన కంచుకోటను కాపాడుకునేలా జాగ్రత్త చర్యలు చేపట్టారు. పార్టీ క్యాడర్‌తో పాటు ప్రజల్లో విశ్వాసం నింపి వైసీపీ వైపు మళ్లకుండా చూసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కంచర్ల శ్రీకాంత్‌ను.. కుప్పం టీడీపీ ఇంచార్జ్‌గా నియమించారు. దీంతో ఇప్పటికే శ్రీకాంత్ కుప్పంలో పర్యటిస్తూ.. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు విజయం కోసం తనవంతు కృషి చేస్తున్నారు. 

ఇదిలా ఉండగానే.. చంద్రబాబు సతీమణి ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు చైర్‌పర్సన్‌ నారా భువనేశ్వరి కూడా తాజాగా కుప్పంలో పర్యటించడం చర్చనీయాంశంగా మారింది. కుప్పంలో టీడీపీ ఓటు బ్యాంకు చేజారిపోకుండా చూసే చర్యల్లో భాగంగానే కుప్పంలో భువనేశ్వరి పర్యటించారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే కుప్పం పర్యటనలో  భువనేశ్వరి.. ఎన్టీఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో కుప్పంలో ఏర్పాటు చేసిన సంజీవని ఉచిత వైద్యశాలను ప్రారంభించడంతో పాటు,  శాంతిపురం మండలం కడపల్లె సమీపంలోని శివపురం వద్ద వారి సొంతింటి నిర్మాణ పనులను పరిశీలించారు. 

ఈ పర్యటనలో భాగంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ ట్రస్టు సేవల ద్వారా కుప్పం రుణం తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చానని చెప్పారు. కుప్పం తమ కుటుంబం అని.. ఈ నియోజకవర్గంలోని ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టు చంద్రబాబునాయుడు సంకల్పంతో పురుడు పోసుకున్నదని చెప్పారు. వరుసగా చంద్రబాబును గెలిపిస్తున్న కుప్పం కుటుంబ సభ్యుల అభిమానానికి ఏమిచ్చినా రుణం తీరదని అన్నారు. అందుకు కృతజ్ఞతగా ఉచిత వైద్య శాలను, దానికి అనుబంధంగా మొబైల్‌ వ్యాన్‌ను ప్రారంభిస్తున్నామని చెప్పారు. కరోనా సమయంలో కూడా ఎన్టీఆర్‌ ట్రస్టు కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఎన్నో సేవలందించిందని తెలిపారు. గతంలో టీడీపీ కుప్పం నియోజకవర్గానికి ఏం చేసిందనేది  కూడా వివరించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా.. తమ సొంత ఇంటి నిర్మాణం ఆరు నెలల్లో పూర్తవుతుందని, అది పూర్తైతే కుప్పం ప్రజలకు మురింత దగ్గరగా ఉండేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. 

అంతేకాకుండా లోకేష్ పాదయాత్ర గురించి మాట్లాడారు. లోకేశ్‌ పాదయాత్ర నిర్వహించాలని భావించినప్పుడు ముందు ఆవేదనకు, ఆందోళనకు గురయ్యానని భువనేశ్వరి చెప్పుకొచ్చారు. పాదయాత్రలో లోకేశ్‌ రాటు తేలిపోయారని, ఇక ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రజల కోసం లోకేశ్ పాదయాత్ర పూర్తి చేసి తీరతారని అన్నారు. 

అదే సమయంలో వైసీపీ పాలనతో తాము కుటుంబపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని భువనేశ్వరి అన్నారు. అవన్నీ అలవాటైపోయాయని.. ఇంకా ఎదుర్కొని పోరాడి విజయంతో బయటకు వస్తామని చెప్పారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు తనను బాధించాయని.. ఆ బాధ నుంచి కోలుకునేందుకు నెల రోజులు పట్టిందని తెలిపారు. 

ఇలా.. ఓవైపు కుప్పంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలను విస్తరించడం, మరోవైపు కుప్పంకు టీడీపీ చేసిన అభివృద్దిని గుర్తుచేయడం చూస్తుంటే నియోజకవర్గంపై భువనేశ్వరి ఫోకస్ చేశారని తెలుస్తోంది. కుప్పంపై వైసీపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసిన నేపథ్యంలో.. అక్కడి నుంచి చంద్రబాబు విజయం కోసం భువనేశ్వరి తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios