శ్రీ గౌతమి హత్య.. నాకేం తెలీదన్న నన్నపనేని

First Published 21, Jul 2018, 1:34 PM IST
nannapaneni rajakumari sensational comments on sri gowthami murder
Highlights

 శ్రీగౌతమి హత్య గురించి మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన శ్రీగౌతమి హత్య గురించి మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గతేడాది జనవరి 18న శ్రీ గౌతమి హత్యకు గురవ్వగా.. మొదట ఆమెది ప్రమాదంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కేసు క్లోజ్ కూడా చేశారు. అయితే.. అది ప్రమాదం కాదని హత్య అని.. ఆమె సోదరి ఆధారాలు సేకరించి సీబీఐకి అందజేయడంతో కేసు కొత్త మలుపులు తిరిగింది.

 ఈ కేసును తప్పుదారి పట్టించబోయిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు సిద్దమైనట్లు జోరుగా వార్తలు సైతం వచ్చాయి. అయితే ఈ సంఘటన గురించి మహిళా కమీషన్‌ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారికి తెలియదంట. గౌతమి హత్యకు గురౌందన్న విషయం తనకు ఇప్పటి వరకూ తెలియదని నన్నపనేని అనడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. 

వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం ఆమె ఏలూరు పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికి జిల్లా పరిషత్‌ అతిథి గృహంలో ఆమె విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మహిళలపై జరుగుతున్న దారుణాలపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలోనే విలేకర్లు గౌతమి హత్య గురించి ప్రస్తావించగా ఆమె చెప్పిన విషయం అందరినీ విస్మయ పరిచింది. పైగా ఏం జరిగిందంటూ నన్నపనేని తిరిగి వాళ్లనే ప్రశ్నించారు.

దీంతో అక్కడ ఉన్నవాళ్లు ఒక్కసారిగా విస్తుపోయారు. మీడియా ప్రతినిథులు విషయాన్ని వివరించడంతో స్పందించిన ఆమె.. ఇప్పటికైనా ఎవరైనా ఫిర్యాదు చేస్తే కచ్చితంగా విచారణ చేస్తామని, లేని పక్షంలో ఎవరూ ఏమీ చేయలేరంటూ చేతులెత్తేశారు.

loader