కాంగ్రెస్ పార్టీ  గుర్తుందా.. 2014 లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో భూస్థాపిత‌మైన పార్టీ..ఆ పార్టీ గురించి ఇప్పుడెంద‌కు అంటారా.. ఇప్పుడు నంద్యాల ఎన్నీక‌ల్లో పోటీ చెయ్య‌డానికి బ‌రిలోకి దిగింది. ఇన్నాళ్లు ప్ర‌జ‌లంద‌రు టిడిపి, వైసీపి పార్టీల మ‌ధ్య పోటీ అనుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా తానున్నాను అంటు బ‌రిలోకి దిగింది.

రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత కాంగ్రెస్ పార్టీ కి ఆంధ్రప్ర‌దేశ్ లో ప్ర‌జ‌లు సున్నాకు ప‌రిమితం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏపీలో అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం ప్రారంభించింది. అందులో భాగంగా నంద్యాల‌ ఎన్నికల్లో తమ అభ్యర్థిని ప్రకటించింది. తమ అభ్యర్థిగా మైనార్టీ వర్గానికి చెందిన అబ్దుల్ ఖాదర్ ను బరిలోకి దించింది. ఈ నెల 5వ తేదీన అబ్దుల్ ఖాదర్ నామినేషన్ వేయనున్నారు. 

నంద్యాల ఉప ఎన్నిక‌ల‌కు అభ్య‌ర్ధి ప్ర‌క‌ట‌న ను ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ప్ర‌క‌టించారు. ఆయ‌న మాట్లాడుతూ, నంద్యాల ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. త‌మ పార్టి నుండి త్వ‌ర‌లోనే ప్ర‌చారం ప్రారంభిస్తామ‌ని ఆయ‌న తెలిపారు.