విజయవాడ: అంతర్వేది రథం ధగ్దం మొదలు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతిరోజూ ఏదో ఒకచోట హిందూ దేవాలయాలపై దాడులు, దేవతల విగ్రహాల ధ్వంసం ఘటనలు చోటుచేసుకుంటూనే వున్నాయి. తాజాగా అలాంటి ఘటనే కృష్ణా జిల్లాలో కూడా జరిగింది. ఓ పురాతన దేవాలయంలోని నంది విగ్రహాన్ని నిన్న(బుధవారం) అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. 

ఇదిలావుంటే తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలో శివాలయం దగ్గరలో గల శ్రీ సీతారామాంజనేయ వ్యాయామ కళాశాల వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం చేయిని గుర్తు తెలియని దుండగులు విరగ్గొట్టారు. దీంతో హనుమాన్ భక్తులు ఆందోళనకు దిగారు. హనుమాన్ చెయి విరగగొట్టడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ తూ.గో.జిల్లా తెలుగు యువత ఉప అధ్యక్షులు పైల సుభాష్ చంద్రబోస్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు  ఘటనా స్థలానికి వెళ్లి విగ్రహాన్ని పరిశీలించారు.

read more  దేవాలయాలపై ఆగని దాడులు...తూ.గో జిల్లాలో హనుమాన్ విగ్రహం ధ్వంసం (వీడియో)

విగ్రహాన్ని ధ్వంసం చేయడం పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హిందూమత ప్రతీకలు మీద దాడులు పెచ్చుమీరుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేసారు. 

అంతర్వేదిలో ఘటనను ఇంకా పూర్తి స్థాయిలో మరువక ముందే ఇలాంటి వరుస సంఘటనలు భక్తులను కలవరానికి గురిచేస్తున్నాయి. రెండు రోజుల క్రితమే  విజయవాడ రూరల్ మండలం నిడమానూరులోని ఓ ఆలయంలో సాయిబాబా విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. షిర్డీ సాయిబాబా మందిరం వద్ద బయట వైపు నెలకొల్పిన బాబా విగ్రహాన్ని మంగళవారం అర్ధరాత్రి దుండగులు ధ్వంసం చేయగా ఉదయం స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఈ ఫిర్యాదు మేరకు సీఐ సురేష్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. హిందూ ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.