ఆళ్లగడ్డ: టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న శనివారం సాయంత్రం వైసిపి ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డిని కలిశారు. అయితే ఈ భేటీ వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని... కేవలం మర్యాదపూర్వకంగానే వారిని తారకరత్న వారిని కలిశారని తెలుస్తోంది. 

తారకరత్న నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని గండికోటలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే షూటింగ్ పూర్తిచేసుకున్న తర్వాత సాయంత్రం సమయంలో వైసిపి నాయకుడు గిరిధర్ రెడ్డిని వెంటపెట్టుకుని ఎమ్మెల్సీ ప్రభాకర్ రెడ్డిని కలిశారు తారకరత్న. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య వ్యక్తిగత సంభాషణలు జరిగాయి తప్ప రాజకీయాలపై ఎలాంటి ప్రస్తావన రాలేదట. 

గంగుల కుటుంబంతో వున్న పరిచయం కారణంగానే మర్యాదపూర్వకంగా తారకరత్న అతడింటికి వెళ్లారు. ఆయనకు గంగుల కుటుంబం సాదర స్వాగతం పలికింది.  ప్రభాకర్ రెడ్డి, బిజేంద్ర రెడ్డిలతో కాస్సేపు మాట్లాడిన అనంతరం తారకరత్న హైదరాబాద్ కు తిరుగుపయనమయ్యాడు. అయితే నందమూరి కుటుంబానికి చెందిన హీరో వైసిపి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశమయ్యింది.