దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. నందమూరి సుహాసిని  కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే.... ఆమె టీఆర్ఎస్ నేత చేతిలో ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల సమయంలో ప్రచారం కూడా బాగానే చేశారు. కానీ... ఓటమి చవిచూడక తప్పలేదు. 

ఆ తర్వాత ఆమె రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. మళ్లీ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు మొదలైన తర్వాత ఒక్కసారి మీడియా ముందుకు వచ్చారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో  టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తోందని... తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రజలను ఆమె కోరారు. 

Also Read సంక్రాంతి పందెంరాయుళ్లు : కోస్తా నుండి సీమకు పాకిన కోడి పందాలు...

మొదట నుండి క్షేత్ర స్థాయిలో బలమైన కార్యకర్తలు ఉన్న టీడీపీ తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది . ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగుతున్న టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు నందమూరి సుహాసిని . తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని నందమూరి సుహాసిని అన్నారు. రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని, ఆ ఘనత ఎన్టీఆర్ కు చెందుతుందని అన్నారు. మహిళలు అభివృద్ధి చెందేందుకు నారా చంద్రబాబునాయుడు తన హయాంలో ఎంతో కృషి చేశారని చెప్పారు.

ఇదిలా ఉండగా... ఆమె ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా దృష్టిసారిస్తున్నట్లు తెలుస్తోంది. రాజధాని రైతులకు, రైతు కూలీలకు నందమూరి సుహాసిని నేడు సంఘీభావం తెలపనున్నారు. నేటి ఉదయం 11 గంటలకు ఆమె రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు. ముందుగా ఎర్రబాలెం, కృష్ణాయ పాలెం, మందడం వెలగపూడి తుళ్లూరు గ్రామాల్లో మహిళలను సుహాసిని పరామర్శించనున్నారు.

తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ముద్రను వేయలేకపోయిన సుహాసిని ఇప్పుడు... ఏపీ రాజకీయాల్లో తానేంటో నిరూపించుకోవాలని అనుకుంటుందా..? అందుకే ఈ అమరావతి పర్యటన చేస్తుందా అనే సందేహాలు మొదలయ్యాయి.