తెనాలి పెమ్మసాని థియేటర్‌లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు అలనాటి నటి ప్రభ, సినీ రచయిత బుర్రా సాయిమాధవ్, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.

తెలుగు జాతి చైతన్యానికి విశ్వరూపం అన్న నందమూరి తారకరామారావు అని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తెనాలి పెమ్మసాని థియేటర్‌లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను బాలకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు అలనాటి నటి ప్రభ, సినీ రచయిత బుర్రా సాయిమాధవ్, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. తెలుగువారి ఆత్మగౌరవానికి అరడుగుల ప్రతిరూపం ఎన్టీఆర్ అని అన్నారు. తెలుగు జాతి చైతన్యానికి విశ్వరూపం ఎన్టీఆర్ అని చెప్పారు. తెలుగువారి హృదయాల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని గుర్తుచేశారు. ఈ రోజు ఆయన శత జయంతి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయని తెలిపారు. ఏడాది పాటు శత జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్టుగా చెప్పారు. మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగువాడిగానే పుడతానని ఎన్టీఆర్ చెప్పేవారని అన్నారు. 

‘‘ఎన్టీఆర్ అన్నది వేదం.. ఆయన చేసింది శాసనం. పేదవాడి కన్నీళ్లు, కష్టాలు తీర్చడానికి తెలుగుదేశం పార్టీ పెట్టారు. నటనలో, వాచకంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పారు. ఆయనకు దరిదాపుల్లో కూడా ఎవరూ రాలేరు’’ అని బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ ఒక లెజెండ్ అని చెప్పారు. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని భావించిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. తెలుగువాడికి ఏ అవసరం ఉన్న నేనున్నానని ముందుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఆనాడూ తెలుగుదేశం పార్టీని అందరూ భుజాలపై మోశారని.. ఈ ఉత్సవాలను కూడా రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా నిర్వహించనున్నట్టుగా చెప్పారు. 

ఇది రాజకీయాలకు మాట్లాడటానికి వేదిక కాదని చెప్పిన బాలకృష్ణ.. అందరూ ఆత్మ విమర్శ చేసుకోవాలని కోరారు. ‘‘ఒక్క తప్పిదం చేశారు.. ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇక అనుభవించకండి. ఆత్మ విమర్శ చేసుకోండి.. మనుషుల్లా బతకండి. ఓటు సరిగా వేస్తేనే గుడి, బడి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం గుడి, గుడిలో ఉన్న లింగాన్ని మింగే రకం. అందరూ ఆలోచించుకోండి. అధికారం కోసం కులాలను, మతాలను వాడుకుంటున్నారో ఇప్పుడు చూస్తున్నాం. అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. మనందరిది ఒక కుటుంబం’’ అని బాలకృష్ణ చెప్పారు. 

అంతకుముందు ఎన్టీఆర్‌ జన్మస్థలమైన నిమ్మకూరులో ఎన్టీఆర్‌ విగ్రహానికి బాలకృష్ణ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఎన్టీఆర్‌ పేరిట అక్కడి వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ.. నిమ్మాకూరు చెరువు వద్ద ఎన్టీఆర్ విగ్రహాం ఏర్పాటు చేస్తామని, ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా రూపు దిద్దుతామని ప్రకటించారు.తెలుగు జాతీ ఉన్నంతవరకు ఎన్టీఆర్‌ చిరస్మరణీయుడిగా కొనసాగుతారని అన్నారు. తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని కొనియాడారు. అన్ని తరాలుకు ఆదర్శప్రాయుడని తెలిపారు.