గుంటూరు జేకేసీ రోడ్డులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్‌ను హిందుపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఆలపాటి రాజా, నక్కా ఆనంద్ బాబులు పాల్గొన్నారు. 

గుంటూరు జేకేసీ రోడ్డులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్‌ను హిందుపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఆలపాటి రాజా, నక్కా ఆనంద్ బాబులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రతి పేద‌వాడి ఆక‌లి తీర్చాల‌న్న టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ ఆశ‌యం అన్నారు. ఆయన స్పూర్తితోనే టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. రాజకీయ ఉద్దేశంతో వైసీపీ అన్న క్యాంటీన్లను రద్దు చేసిందని బాలకృష్ణ ఆరోపించారు. పేద ప్రజలకు ఐదు వేళ్లు నోట్లోకి పోనివ్వకుండా చేసిందని మండిపడ్డారు.

 ప్రభుత్వ దుర్మార్గాలు ప్రజల పాలిట శాపాలుగా మారాయని బాలకృష్ణ విమర్శించారు. తెలుగు ప్రజల సహకారంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాట‌వుతాయ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. వైసీపీ ప్ర‌భుత్వం రూ.8 ల‌క్ష‌ల కోట్ల అప్పులు చేసిందన్న బాల‌య్య‌.. దాని ప్ర‌భావ‌మే ప్ర‌జ‌ల‌పై ప‌న్నుల బాదుడే బాదుడు అని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. మరుగుదొడ్లపైనా పన్ను వేసే పరిస్థితి వచ్చిందన్నారు. 

వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో కూడా తిరుగుబాటు వస్తోందని బాలకృష్ణ. ఇలాంటి ప్రభుత్వంపై ప్రజలు ఉద్యమించాలని కోరారు. తిరిగి టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఇక, ఈ అన్న క్యాంటీన్‌లో రూ. 2కే భోజనం అందించనున్నారు. 

ఇక, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని శ్రీసత్యసాయి జిల్లా హిందుపురంలో ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ సతీమణి వసుంధర శనివారం అన్న క్యాంటిన్‌ను ప్రారంభించారు. ఈ అన్న క్యాంటిన్ ద్వారా పేదలకు రూ. 2కే భోజనం అందించనున్నారు. బాలకృష్ణతో పాటు అమెరికాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈ అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. నేడు ఈ క్యాంటిన్‌ను ప్రారంభించిన వసుంధర మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కోడలు అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. 

‘‘ఎన్నారై ఎన్టీఆర్ అభిమానులు, నందమూరి బాలకృష్ణ గారు కలిసి దీనిని ఏర్పాటు చేశారు. రూ. 2కే భోజనం. ఇలాంటిది ఎక్కడ చూసి ఉండరు. నందమూరి పురంలోనే ఇది సాధ్యమైందని చెప్పారు. త్వరలోనే రాష్ట్రమంతా అమలు చేస్తే బాగుంటుంది. మా మామ గారు ఎన్టీఆర్.. పైనుంచి ఇవన్నీ నడిపిస్తున్నారు’’ అని వసుంధర చెప్పారు. అయితే వసుంధర మాట్లాడుతున్న సందర్భంగా హిందుపురంను నందమూరి పురం అని వ్యాఖ్యానించడం గమనార్హం.