అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పగటికలలు కంటున్నారని విమర్శించారు ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేశామనే ఊహల్లో విహరిస్తోందని ఎద్దేవా చేశారు. 

అమరావతిలో మీడియాతో మాట్లాడిన నక్కా ఆనందబాబు ఈసారి కూడా తెలుగుదేశం పార్టీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లలో విజయం సాధిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ఏపీ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. 

వైసీపీ ఫిర్యాదు చేసిన నిమిషాల్లోనే ఈసీ చర్యలు తీసుకుందని, అదే ఓట్ల గల్లంతుపై టీడీపీ ఫిర్యాదు చేస్తే ఎన్నికల కమిషన్ కనీసం స్పందించలేదని ఆరోపించారు. కేంద్రం చెప్పినట్టే ఈసీ పనిచేసిందన్నారు. 

వీవీ ప్యాట్స్ లెక్కించమంటే ఈసీ ఎందుకు అంగీకరించడం లేదో చెప్పాలని నిలదీశారు. ఈవీఎలం పనితీరు, ఈసీ వ్యవహర శైలిపై చంద్రబాబు నాయుడు దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నారని ఆనందబాబు స్పష్టం చేశారు.