ఇటీవల కాలంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను చాలా చిన్న విషయాలుగా 'ఏవో జరిగాయంటా' అని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడటాన్ని మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు తప్పుబట్టారు.

మంగళగిరి: ఆంధ్ర ప్రదేశ్ లో అత్యాచారాలు, హత్యలు జరుగుతూ ఉంటాయి... వాటికి రేట్లుకట్టి చేతులు దులుపుకుంటామన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరించడం దారుణమని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. అత్యాచారాలు, ఆడబిడ్డలపై జరిగే అమానుషాలను చిన్నవిగా చూపుతూ స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‘ఏవో జరిగాయంటా’అనడం సిగ్గు, శరం, ఇంగితం, మానవత్వం లేకుండా వ్యవహరించడమేని ఆనంద్ బాబు మండిపడ్డారు. 

''రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న అత్యాచారాలు, ఇతర దారుణాలను, ముఖ్య మంత్రి అసమర్థతను, ప్రభుత్వ వైఫల్యాన్ని తాము ఎత్తిచూపుతుంటే అసలేమీ జరగడంలేదన్నట్టుగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణాలకు బాధ్యత వహించాల్సింది ముఖ్యమత్రి కాదా? ప్రతిపక్షాలు మీడియా యాగీచేస్తున్నాయని కల్లబొల్లిమాటలు చెబుతున్న ముఖ్యమంత్రి... అసలు జరుగుతున్న దారుణాలను కట్టడిచేయడానికి తానేం చేస్తున్నాడో ప్రజలకు చెప్పడా? దిశాయాప్, దిశా చట్టానికి తేడా తెలియకుండా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. తాను తీసుకొచ్చిన యాప్ తో ఎందరు మహిళల్ని రక్షించి, ఎందరు దుర్మార్గుల్ని శిక్షించాడో మీడియాముఖంగా వాస్తవాలు వెల్లడించగలడా?'' అని ఆనంద్ బాబు ప్రశ్నించారు. 

''మొన్నటివరకు హోంమంత్రిగా ఉన్న ఆమెతో దిశాచట్టం తీసుకొచ్చామని... దానికింద ఇంతమందిని శిక్షించామని పచ్చి అబద్ధాలు చెప్పించారు. లేనిచట్టంతో శిక్షలు, ఉరిశిక్షలు వేయించామని స్వయంగా హోంమంత్రి స్థానంలో ఉన్నవారితో అబద్ధాలు చెప్పించే దీనస్థితికి ఈ ప్రభుత్వం దిగజారింది. కొత్తగా హోంమంత్రిగా వచ్చిన మరో ఆమె కూడా పోయిన ఆమెకు తానేమీ తక్కువకాదన్నట్లుగా మాట్లాడుతున్నారు. గతంలో హోంమంత్రిగా చేసిన ఆమె, ఇప్పుడు చేస్తున్నఆమె ఇద్దరూ కూడ దళిత సోదరీమణులే. కానీ వారితో ఈ ప్రభుత్వం ఇలా అబద్ధాలు చెప్పించడం ఏమిటన్నదే తమ ప్రశ్న'' అన్నారు. 

''వైసీపీ ప్రభుత్వం రూ.120కోట్లను ఎస్టీ ఎస్సీ అత్యాచార నిరోధక చట్టానికి, మహిళలపై జరిగిన అత్యాచారాల నిరోధానికి ఖర్చుచేసినట్టుగా హోంమంత్రి చెప్పడం సిగ్గుచేటు. అసలు ఇలాంటివి చెబుతున్నందుకు సిగ్గుపడాలి. వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల పాలనలో రూ.120కోట్లు ఖర్చుపెడితే, టీడీపీ ప్రభుత్వం రూ.50కోట్లే ఖర్చుపెట్టిందని మహిళగా ఉన్న ఆమె చెప్పడం నిజంగా సిగ్గుపడాల్సిన అంశం. అత్యాచారాలు జరుగుతాయి...తాము డబ్బులిచ్చి చేతులుదులుపుకుంటామని ప్రభుత్వం ఉద్దేశమా....హోంమంత్రి భావనా? ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంప్రకారం అత్యాచారానికి గురైన బాధితురాలికి రూ.8లక్షల పరిహారం ఇవ్వాలి. ఆ విధంగా హోంమంత్రి చెప్పిన రూ.120కోట్లను లెక్కగడితే రాష్ట్రంలో ఈ మూడేళ్లలో 1500 నుంచి 1600వరకు అత్యాచారాలు జరిగాయని ఆమె ఒప్పుకున్నట్లు స్పష్టమవుతోంది. నిజంగా అలా జరిగిందని చెప్పడానికి ఈ ప్రభుత్వానికి సిగ్గులేదా?'' అని మండిపడ్డారు. 

''నేరస్థులపట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించబట్టే కదా రాష్ట్రంలో ఆడబిడ్డలు బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన దుస్థితి ఏర్పడింది. మాట్లాడితే ఈ చేతగాని మంత్రులు, అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబుని, ఆయన పాలనను విమర్శిస్తుంటారు. టీడీపీ హాయాంలో గుంటూరు జిల్లాలోని దాచేపల్లి ప్రాంతంలో ఒక యువకుడు బాలికపై అత్యాచారానికి పాల్పడితే, అతన్ని శిక్షించడానికి ఆనాడు చంద్రబాబు వెంటనే ప్రత్యేకబృందాల ను నియమించారు. దాంతో భయపడిన నిందితుడు చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు. తప్పుచేసినవాడు భయంతో చనిపోయే పరిస్థితిని చంద్రబాబు కల్పిస్తే, ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి అత్యాచారాలతో పేట్రేగిపోండి అని ప్రోత్సహిస్తున్నారు'' అని అన్నారు. 

''రాష్ట్రంలో వరుసగా ఆడబిడ్డలు, చిన్నారులపై దారుణాలు జరగడానికి, హింస చెలరేగడానికి ప్రధాన కారణం తన ఖజానా నింపుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అమ్ముతున్న జేబ్రాండ్ మద్యం, ఇతర మాదకద్రవ్యాలే. వాటి అమ్మకాలు విచ్చల విడిగా జరగబట్టే, రాష్ట్రంలో మహిళల మానప్రాణాలకు రక్షణ లేకుండాపోయింది. పిచ్చిమద్యం తాగిన పిచ్చివాళ్లు, పైశాచికత్వంతో పేట్రేగిపోతుంటే ముఖ్యమంత్రేమో ఏదో జరిగిందంటా.. ఎవరో చేశారంటా అంటూ సిగ్గులేకుండా ‘ట’ గుణింతం చెబుతున్నాడు'' అని ఆనంద్ బాబు మండిపడ్డారు. 

''ముఖ్యమంత్రి వైఖరి అలాఉంటే హోంమంత్రేమో తల్లులపెంపకం సరిగాలేకనే రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతున్నాయని మాట్లాడారు. మహిళగా ఉన్నామె సాటి మహిళల్ని కించపరిచేలా మాట్లాడాల్సింది కాదు. బాధ్యత విస్మరించిన ప్రభుత్వంలానే ప్రతిపక్షం కూడా ఉండాలని అధికారపార్టీవారు కోరుకుంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కిందిస్థాయి వైసీపీ నేతలు సిగ్గులేకుండా ప్రతిపక్షాన్ని, చంద్రబాబుని నిందించడం... అత్యాచారం జరిగితే అక్కడకువెళ్లి బాధితురాలికి పరిహారం పేరుతో డబ్బులిచ్చి ఫోటోలు దిగి చేతులు దులుపుకోవడం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నవారు ఇదేనా చేయాల్సింది? బాధ్యత, భయం భక్తి అనేవి ప్రభుత్వానికి, మంత్రులకే లేకపోతే అన్నింటికీ తెగించి సమాజంపై పడేవారికి ఉంటాయా? అత్యాచారాలు జరక్కుండా చూడాల్సిన వారు మూడేళ్లలో రూ.120కోట్లు ఖర్చు పెట్టామని చెప్పడం ప్రభుత్వ దిగజారుడుతనం కాదా?'' అని మాజీ మంత్రి ఆనంద్ బాబు మండిపడ్డారు.