గుంటూరు: ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులంటూ కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కు దమ్ముంటే చంద్రబాబు నాయుడు విసిరిన సవాల్ ను స్వీకరించి పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. 

ఆత్మకూరులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆనంద్ బాబు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు విసిరిన సవాల్ కు వైసీపీ నేతల వద్ద సమాధానం లేదంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు రాజధానిని మార్చబోమని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు మూడు రాజధానులని రాష్ట్ర ప్రజల భవిష్యత్ ను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. 

read more   రక్షా బంధన్ రోజే ఇద్దరు గిరిజన ఆడబిడ్డల మాన, ప్రాణాలు...: డిజిపికి చంద్రబాబు లేఖ

సచివాలయానికి వెళ్లాలంటే రాయలసీమ ప్రజలకు, హైకోర్టుకు వెళ్లాలంటే ఉత్తరాంధ్ర ప్రజలకు భారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానుల పేరుతో యువత భవిష్యత్ ను అంధకారం చేసి వైసీపీ నాయకులు ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గు లేకుండా కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ నాయకులు జగన్ ఫోటోకు పాలాభిషేకం చేస్తున్నారని మండిపడ్డారు.  

కరోనాతో ప్రజలు అల్లాడిపోతుంటే ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మూడు రాజధానులు తెరపైకి తెచ్చారని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళితులు, గిరిజనులపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నకరికల్లులో గిరిజన మహిళను ట్రాక్టర్ తో తొక్కించిన వైసీపీ నేత శ్రీనివాసరెడ్డిపై, కర్నూలు జిల్లాలోని జమ్మినగర్ తాండాలో భర్త ఎదుటే మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన యువకులపై ఇంత వరకు చర్యలు తీసుకోలేదన్నారు. కల్తీమద్యం తాగి కురిచేడులో 15 మంది, శానిటైజర్ తాగి కడపలో ముగ్గురు చనిపోయారని ఇవి ప్రభుత్వ హత్యలేనని ఆనంద్ బాబు మండిపడ్డారు.