గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం శాంతిభద్రతల పరిస్థితి చాలా దారుణంగా వుందంటూ రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ కు మాజీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు  బహిరంగ లేఖ రాశారు. వైసిపి ప్రభుత్వం ఏర్పడినప్పడి నుండి శాంతిభద్రతల పరిస్థితి ఇలా తయారయ్యిందని... చివరికి రక్షా బంధన్ రోజే  ఇద్దరు గిరిజన ఆడబిడ్డల ప్రాణాన్ని, మానాన్ని కాలరాయడం మరీ దారుణమంటూ లేఖలో పేర్కొన్నారు.

డిజిపికి చంద్రబాబు రాసిన లేఖ యదావిధిగా...

గౌ. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డిజిపి) గారికి,

డిజిపి కార్యాలయం, అమరావతి

నమస్కారం..

విషయం: నకరికల్లు మండలంలో గిరిజన మహిళ హత్య-వెలిగోడు మండలంలో గ్యాంగ్ రేప్ –రాష్ట్రంలో నేరగాళ్ల స్వైర విహారం-క్షీణించిన శాంతిభద్రతల అంశం గురించి...

రాష్ట్రంలో గత ఏడాది మే నెల నుంచి నేరాలు,ఘోరాలు పేట్రేగిపోవడంపై ఇప్పటికే అనేక లేఖల ద్వారా మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. శాంతిభద్రతలు పరిరక్షించాలని, అరాచక శక్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని అనేకమార్లు విజ్ఞప్తి చేశాం. అయినా రాష్ట్రంలో నేరగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట పడకపోగా రోజురోజుకు శ్రుతిమించడం బాధాకరం. బడుగు బలహీన వర్గాల ప్రజానీకం ధన మాన ప్రాణాలకు భద్రత లేకుండా పోవడం శోచనీయం. తమను ఎవరూ కట్టడి చేయలేరనే ధీమాతోనే అరాచకశక్తులు ఈ విధంగా ప్రతిచోటా రెచ్చిపోతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి అనడానికి ఇవన్నీ తార్కాణాలే...

చివరికి రక్షా బంధన్ రోజే నిన్న 2జిల్లాలలో ఇద్దరు గిరిజన ఆడబిడ్డల ప్రాణాన్ని, మానాన్ని కాలరాయడం(గుంటూరు జిల్లాలో హత్య, కర్నూలు జిల్లాలో గ్యాంగ్ రేప్) అత్యంత కిరాతకం.  అప్పు చెల్లించలేదన్న అక్కసుతో గిరిజన మహిళ రమావత్ మంత్రూబాయిని ట్రాక్టర్ తో తొక్కించి  చంపడం రాక్షసత్వానికి పరాకాష్ట. పొలం అమ్మి అప్పు తీరుస్తామని ప్రాధేయబడ్డా కనికరించకుండా ట్రాక్టర్ తో తొక్కించి మంత్రూబాయిని హత్య చేయడం అనాగరికం.

భర్త కళ్లెదుటే గిరిజన మహిళను గ్యాంగ్ రేప్ చేయడం మరో కిరాతక చర్య. కర్నూలు జిల్లా వెలిగోడు మండలంలో జరిగిన ఈ ఘోర దుర్ఘటనపై  ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోక పోవడం, గిరిజన సంఘాల ఆందోళనలతో కేసు నమోదు చేయడం, రాష్ట్రంలో ఒక వర్గం పోలీసుల్లో పెరిగిన ఉదాసీనతకు నిదర్శనం. రాజమహేంద్రవరంలో దళిత మైనర్ బాలికపై 12మంది గ్యాంగ్ రేప్ చేసి పోలీస్ స్టేషన్ వద్ద వదిలేయడం నేరగాళ్ల బరితెగింపును బట్టబయలు చేసింది. తామే నేరం చేసినా తమనెవరూ ఏమీ చేయలేరనే అలుసుతోనే అరాచక శక్తులు బరితెగించాయి.  

రాష్ట్రవ్యాప్తంగా 14నెలల్లోనే 400మందిపైగా ఆడబిడ్డలపై అఘాయిత్యాలు, 15చోట్ల గ్యాంగ్ రేప్ లు, 8మంది మహిళల హత్యలు, అవమానంతో 6గురు ఆత్మహత్యలు చేసుకున్నారని మీడియా కథనాలే పేర్కొన్నాయి. చిత్తూరు జిల్లా యేర్పేడు మండలంలో, చంద్రగిరి నియోజకవర్గం పనపాకలో, ఉదయగిరి నియోజకవర్గం వెంకట్రావు పల్లెలో, తాడిపత్రిలో దళిత బాలికలపై అత్యాచారాలు జరిగాయి. చిత్తూరు జిల్లాలో దళిత వైద్యురాలు అనితారాణి పట్ల ఎంత అసభ్యంగా వ్యవహరించారో మీకు తెలిసిందే. బిసి, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికే పరిస్థితి నెలకొంది. 

ఒకప్పుడు ఏపి పోలీసింగ్ కు దేశంలోనే గొప్ప పేరు ఉండేది. గత 14నెలలుగా రాష్ట్ర పోలీస్ యంత్రాంగంలో చోటు చేసుకున్న అవాంఛనీయ పోకడలతో నేరగాళ్లు విశృంఖల విహారం చేస్తున్నారు. ప్రజలకు భద్రత ఇవ్వాల్సిన పోలీస్ శాఖలో కొందరు రాజకీయ ప్రలోభాలు, పైరవీలు, అలసత్వం, ఉదాసీనత, అవినీతికి పాల్పడితే, అరాచక శక్తులు ఏవిధంగా బరితెగిస్తాయో మన రాష్ట్రంలో జరుగుతోన్న గొలుసుకట్టు దుర్ఘటనలే నిదర్శనం.  దిశా చట్టం చేశామని, దిశా పోలీస్ స్టేషన్లు నెలకొల్పామని చెబుతున్నారే తప్ప ఆచరణలో ఏదీ అమలు కావడం లేదు. ఇదేనా దిశాచట్టం అమలు చేసే విధానం, శాంతిభద్రతలు పరిరక్షించే పద్దతి ఇదేనా..అని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా తక్షణమే స్పందించి అరాచక శక్తుల ఆగడాలకు, నేరగాళ్ల అరాచాకలకు అడ్డు కట్ట వేయాలి. బడుగు బలహీన వర్గాల ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ కల్పించాలి. 

కర్నూలు జిల్లా వెలిగోడు గిరిజన మహిళ గ్యాంగ్ రేప్ నిందితులు, గుంటూరు జిల్లా నకరికల్లు గిరిజన ఆడబిడ్డ హంతకులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. 

నారా చంద్రబాబు నాయుడు,

శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత.