ఎంఎల్ఏ, మంత్రుల పనితీరుపైన చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి కూడా సర్వేలు చేయిస్తున్నట్లు కొందరు నేతలు చెబుతున్నారు.
చంద్రబాబు వరస చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో కనీసం సగం మందికి టిక్కెట్లు ఇచ్చేట్లు కనబడటం లేదు. గడచిన రెండున్నరేళ్ళుగా ఎంఎల్ఏల పనితీరుపై అనేక సర్వేలు చేయించుకున్నారు. ప్రతీ సర్వేలోనూ పలువురు శాసనసభ్యుల పనితీరు ఏ మాత్రం ఆశాజనకంగా ఉన్నట్లు కనబడలేదు.
ఇటువంటి వారిలో మొదటిసారి గెలిచిన వారితో పాటు పలుమార్లు గెలిచిన ఎంఎల్ఏలు కూడా ఉండటం చంద్రబాబును ఆశ్చర్యానికి గురిచేసినట్లు సమాచారం. చాలా మంది శాసనసభ్యులు డబ్బు సంపాదనే ధ్యేయంగా వ్యవహారాలు నడుపుతున్న కారణంగానే నియోజకవర్గంలో వారికి మంచి పేరు లేదన్నవిషయం సర్వేల్లో తేలుతోంది.
డబ్బు సంపాదనపై ఆరోపణలు, కార్యకర్తలకు అందుబాటులో లేకపోవటంతో పాటు పార్టీ పట్ల కూడా కొందరికి అంకితభావం లేదన్నవిషయం సర్వేల్లో స్పష్టమవుతోంది. దాంతో సర్వే ఫలితాలు గమనించిన చంద్రబాబులో కలవరం మొదలైంది.
తాజాగా జరిగిన ఎంపి, ఎంఎల్ఏ, ఎంఎల్సీల వర్క్ షాపులో ఇదే విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించటం గమనార్హం. సర్వేల ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తానని చెప్పారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి చంద్రబాబు ఇప్పటి వరకూ కనీసం పది సార్లు సర్వే చేయించుకున్నారు. ఈ సర్వేల్లో చాలా మందికి కనీస మార్కులు కూడా రాకపోవటం పట్ల సిఎం నిశ్చేష్టులైనట్లు సమాచారం.
చాలా మందికి అవసరమైన అండదండలు అందిస్తున్నప్పటికీ డబ్బు సంపాదనే ధ్యేయంగా ఎందుకు పెట్టుకున్నారో అధినేతకు అర్ధం కావటం లేదు.
ఇదే విషయాన్ని వర్క్ షాపు సందర్భంగా కొంతమంది ఎంఎల్ఏలను విడిగా పిలిపించుకుని నిలదీసినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. రెండున్నర సంవత్పరాల్లో మెరుగుపడని వారి పనితీరు ఇప్పటికిప్పుడు ఆశించిన ఫలితాలు వస్తాయన్న నమ్మకాన్ని చంద్రబాబు కోల్పోయారు. దాంతో కనీసం సగంమందికి టిక్కెట్ల కేటాయింపులో కోత పడుతుందనేది పార్టీ వర్గాల విశ్లేషణ.
వేటు పడే వారిలో ఎంఎల్ఏలే కాదు మంత్రులు కూడా ఉన్నారు. రెండున్నర సంవత్సరాలుగా మంత్రులుగా పనిచేస్తూ కూడా ఇంకా శాఖలపై పట్టు సాధించని వారున్నారంటే ఆశ్చర్యమే. మంత్రులుగా ఉంటూ సొంతపనులను చక్కబెట్టుకోవటంపైనే దృష్టి నిలపుతున్నట్లు ఆరోపణలు చంద్రబాబు వద్ద సమాచారం ఉంది.
ఎంఎల్ఏ, మంత్రుల పనితీరుపైన చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి కూడా సర్వేలు చేయిస్తున్నట్లు కొందరు నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ఒకటికి రెండు సార్లు చేయించిన సర్వేల్లో ఫలితాలు చాలా నిరాసజనకంగా ఉన్నట్లు నివేదికలు అందాయి.
ఇటుువంటి ఎంఎల్ఏల్లో ఫార్టీ ఫిరాయించిన శాసనసభ్యులు కూడా ఉన్నట్లు తెలిసింది అదే విషయాన్ని బ్రాహ్మణి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళినట్లు కూడా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
