జనాల మైండ్సెట్ తనకు అనుకూలంగా మలచుకునేందుకు ఇప్పటి నుండే గుడ్డకాల్చి జగన్మోహన్ రెడ్డి మొహాన పడేస్తున్నారు.
చంద్రబాబునాయుడు ప్రజలను పదే పదే హిప్నటైజ్ చేస్తున్నారు. జగన్ కు వ్యతిరేకంగా ప్రజల మైండ్సెట్ మార్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి జగన్ వ్యతిరేకమని ప్రజల్లోకి నాటేందుకు నిప్పు చంద్రబాబు బాగా శ్రమిస్తున్నారు. తాజాగా జగన్ను ఉద్దేశించి చంద్రబాబు చెప్పిన మాటలు అలానే ఉన్నాయి. ఒకటికి పదిసార్లు ‘కుక్కను చూపించి నక్క’ అని అంటే ప్రజలు నమ్మతారన్నది చంద్రబాబు థియరీ.
లేకపోతే, ప్రతిపక్ష నేత తలచుకుంటే రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోతుందా ఎక్కడైనా? అదే నిజమైతే మరి అధికారపక్షమెందుకు? ముఖ్యమంత్రి, మంత్రివర్గం ఏం చేస్తున్నట్లు? చంద్రబాబునాయుడు కడప జిల్లాలోని స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ప్రాజెక్టులకు జగన్ వ్యతిరేకమట. ప్రతీ అభివృద్ధి కార్యక్రమాన్నీ జగన్ అడ్డుకుంటున్నాడట. ఏంటి నిజమేనా అని అడగవద్దు. ఎందుకంటే చెప్పింది సాక్ష్యాత్తు చంద్రబాబు మరి. ప్రతిపక్ష నేత వల్లే అభివృద్ధి ఆగిపోతుంటే మరి 40 ఇయర్స్ ఎక్స్ పీరియన్స్ ఏమైనట్లు నారావారికి?
మహిళా పార్లమెంటేరియన్ల సదస్సును భగ్నం చేయటానికి కూడా మనుషులను పంపారట. వైసీపీ వాళ్లను సదస్సులోకి అసలు అడుగే పెట్టనీయలేదుకదా? ఇక సదస్సును చెడగొట్టిందెక్కడ? రోజాను గన్నరవరం విమానాశ్రయంలోనే అరెస్టు చేసి హైదరాబాద్ తరలించారు కదా? కాకపోతే సదస్సులో పాల్గొన్న కొందరు విద్యార్ధినులు చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై అడిగి షాక్ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు తమకు అందటం లేదని నిలదీసారు. బహుశా వారిని కూడా జగనే పంపారని అనుకున్నారేమో నారావారు.
ఇక, స్ధానిక సంస్ధల కోటాలోని ఎంఎల్సీ స్ధానాలను గెలుచుకోవటానికి చంద్రబాబు నానా అవస్తలు పడుతున్నారు. అందులో భాగంగానే వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులను ఎక్కడ అవకాశం ఉంటే అకడల్లా లాక్కుంటున్నారు. దాంతో ప్రజాప్రతినిధుల వ్యవహారం కప్పల తక్కెడలాగ తయారైంది. ఎవరు ఎవరికి ఓటు వేస్తోరో కూడా ఓటు పడేంతవరకూ చెప్పే పరిస్ధితి లేదు. అందుకనే చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది. రేపటి ఎన్నికల సమయంలో రాష్ట్రాభివృద్ధి ఎందుకు కాలేదు అని ఎవరైనా అడిగితే చెప్పుకోవటానికి ఇప్పటి నుండే చంద్రబాబు మంచి వేదికను సిద్ధం చేసుకున్నారు. అందుకనే జనాల మైండ్సెట్ తనకు అనుకూలంగా మలచుకునేందుకు ఇప్పటి నుండే గుడ్డకాల్చి జగన్మోహన్ రెడ్డి మొహాన పడేస్తున్నారు.
