రాజమండ్రి కార్తీక వన భోజనానికి హాజరుకానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

సంక్రాంతి, ఉగాది పర్వదినాలు, గోదావరి,కృష్ణ పుష్కరాలను పెద్ద ఎత్తున నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం ఇపుడు కార్తీక వన సమారాధన కార్యక్రమాలను కూడా ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. గతంలో ఎపుడూ పండుగలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఇలా నిర్వహించలేదు. తెలంగాణా ప్రభుత్వం బతుకమ్మ, బోనాలు,సమ్మక్క సారక్క వంటి తెలంగాణా ప్రత్యేక పండగలను వైభవంగా నిర్వహించడంతో, ఆంధ్రకు ప్రత్యేక పండుగలు లేకపోవడంతో ఉన్న పండగలనే అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్వహించి ఏదో విధంగా ఆంధ్ర సెంటిమెంట్ ను సృష్టించేందుకు, ఐక్యతను సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు.

రాజమహేంద్రవరంలో నవంబర్ నెల 19 వ తేదీన జరిగే కార్తీక వన సమారాధనలో తాను పాల్గొంటానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ప్రకృతితో మనిషి అనుసంధానమయ్యే సమయం కార్తీక వనభోజనాలను ఇదేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వర్ణించారు. 2014 లోనే ముఖ్యమంత్రి కార్తీక వనమహోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా ప్రకటించారు. ఆ ఏడాది ఆయన విశాఖ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో ఆయన అటవీశాఖ కార్యక్రమాలను సమీక్షించారు. హరితాంధ్ర మిషన్ లో విద్యార్ధులను భాగస్వాములుగా చేయాలని, ప్రతిశనివారం ర్యాలీలు చేపట్టి ప్రజల్లో ‘వనం-మనం’ కార్యక్రమంపై అవగాహన పెంపొందించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘వనం పిలుస్తోంది’ ప్రచారంతో చైతన్యం కలిగించాలన్నారు.

ఆకాశహార్మ్మాలతో కాంక్రీట్ జంగిల్స్ లా మారిన నగరాల్లో నగర వనాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రతి మునిసిపల్ కార్పోరేషన్ పరిధిలో 15 లేక 20 ఎకరాల విస్తీర్ణంలో నగర వనాలను ఏర్పాటు చేయాలన్నారు.

నగర వనాల్లో 2.5 నుంచి 6 కి. మీ వరకు సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ ఏర్పాచే చేయాలని సూచించారు. ఔషధ విలువలు గల మొక్కలను పెంచటానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. యోగ అభ్యాసం చేసేందుకు వసతి కల్పించాలని, కేఫెటరేరియా లాంటి సౌకర్యాలు కల్పించాలన్నారు.

నవంబర్ నాటికి రాజమహేంద్రవరంలోని దివాన్ చెరువు, కాకినాడ దగ్గర కోరింగ,గుంటూరు జిల్లా నల్లపాడు, కర్నూలు జిల్లా గార్గేయపురం వనాలు సిద్ధమవుతాయని అధికారులు ముఖ్యమంత్రి చెప్పారు.

డిసెంబర్ నాటికి తిరుపతి దివ్యారామం, చిత్తూరు, కడప, జనవరికల్లా విజయవాడ దగ్గర కొత్తూరు, విశాఖపట్నం సమీపాన కంబాలకొండ, నెల్లూరులలో నగర వనాలు ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామని తెలిపారు.