చంద్రబాబు యూ టర్న్

Naidu taking U turn on demonetization
Highlights

చిన్న నోట్ల సరఫరా అవసరాన్ని నొక్కి చెప్పారు.  జనాల అవసరాలకు సరిపడా డబ్బులు అందకపోతే కష్టమన్నారు.

నోట్ల రద్దు విషయంలో చంద్రబాబు మెల్లిగా యూ టర్న్ తీసుకుంటున్నారు. నోట్ల రద్దు తర్వాత క్షేత్రస్ధాయిలో ప్రజల ఇబ్బందులకు వ్యతిరేకంగా మాట్లాడితే లాభం లేదని అనుకున్నట్లున్నారు. నోట్లు రద్దు అయిన నవంబర్ 8వ తేదీ రాత్రేమో తానే పెద్ద నోట్ల రద్దు చేయమని ప్రధానమంత్రి నరేంద్రమోడికి చెప్పానన్నారు.

 

ఆ తర్వాత ప్రజల్లో మొదలైన అలజడి, వ్యతిరేకత చూసిన తర్వాత ఆ మాట మళ్ళీ ఎక్కడా మాట్లాడలేదు.

 

ప్రజావసరాలకు సరిపడా డబ్బు సరఫరా కాలేదు. ఇంకోవైపు మోడి ప్రజలందరినీ డిజిటల్ లావాదేవీలు మొదలుపెట్టమని చెప్పారు. వెంటనే చంద్రబాబు కూడా డిజిటల్ లావాదేవీలంటూ ఊదరమొదలుపెట్టారు. కొద్ది రోజులు కాగానే అది కూడా ముగిసింది. ఎందుకంటే, అమ్మేవాళ్ళ దగ్గరా స్వైపింగ్ మెషీన్లు లేక, జనాలూ ఇష్టపడకపోవటంతో ఆ ముచ్చటా అటకెక్కింది.

 

నోట్ల రద్దై ఇప్పటికి 40 రోజులైనా జనాల కరెన్సీ సమస్యలు పెరుగుతున్నాయే కానీ ఎక్కడా తగ్గటం లేదు. మోడి చెప్పిన ‘50 రోజుల త్యాగాల’ గడువు కూడా దగ్గర పడుతోంది. ప్రజల్లో అటు మోడిపైన ఇటు చంద్రబాబుపైనా ఒకే విధమైన ఆగ్రహం వ్యక్తమవుతోంది. దాంతో చంద్రబాబులో పునరాలోచన మొదలైంది.

 

ఇంకా మోడికి మద్దతుగా మాట్లాడుతుంటే మొదటికే మోసం వస్తుందన్న ఆందళన మొదలైంది. అందుకే తాజాగా జరిగిన ఎంపి, ఎంఎల్ఏ, ఎంఎల్సీల వర్క్ షాపులో మాట్లాడుతూ, చిన్న నోట్ల సరఫరా అవసరాన్ని నొక్కి చెప్పారు. జనాల అవసరాలకు సరిపడా డబ్బులు అందకపోతే కష్టమన్నారు.

 

సొమ్ముల కోసం బ్యాంకుల ముందు బారులు తీరుతున్న వారిలో వృద్ధులు మరణిస్తుంటే తన మనస్సు చలించిపోతోందన్నారు. నగదు రహిత లావాదేవీలు చేయాలన్నా అందరి వద్దా కార్డులు లేవన్నారు. అదే సమయంలో వ్యాపారస్తుల వద్ద కూడా స్పైపింగ్ మెషీన్లు కూడా లేవన్నారు.

 

పనిలో పనిగా బ్యాంకుల పనితీరు కూడా బాగాలేదన్నారు. అందుకనే, సామాజిక భద్రత పెన్షన్లకు ప్రభుత్వం ఇస్తున్న డబ్బును బ్యాంకులకు కాకుండా నేరుగా ప్రభుత్వానికి ఇవ్వాలని ఆర్బిఐని కోరారు. ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఉంటుందని అయితే, ఈ సమస్యకు మాత్రం పరిష్కారం కనబడటం లేదని చంద్రబాబు వాపోయారు.

loader