సమర్ధతను నిరూపించుకోవాల్సింది బ్యాంకర్లు, అధికారులు, ప్రభుత్వ సిబ్బంది కాదు. అదనపు నిధులు రావాలంటే సమర్ధత నిరూపించుకోవాల్సింది చంద్రబాబే.

చంద్రబాబు సమర్ధతకు పెద్ద పరీక్షే వచ్చింది. నోట్ల రద్దు సమస్యను ప్రజలు అధిగమించాలంటే రాష్ట్రావసరాలకు సరిపడా నగదును ఆర్బిఐ పంపాలి. ఆర్బిఐ నగదు పంపాలంటే బ్యాంక్ ఉన్నతాదికారుల వల్లో లేక ప్రభుత్వ ఉన్నతాధికారుల వల్లో సాధ్యం కాదు. అందుకు చంద్రబాబే పూనుకోవాలి. సరిపడా నిధులు ఆర్బిఐ పంపితే బ్యాంకర్లు పంపిణీ చేస్తారు లేక పోతే చేతులెత్తేస్తారు.

వాస్తవ పరిస్థితి ఇదైతే ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు రోజుకో మాట మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నారు. అదేమంటే ప్రతీ రోజు 6 గంటలు సమీక్షలు పెడుతున్నట్లు చెబుతున్నారు. సమీక్షలు పెడితే సమస్యలు పరిష్కారం అవుతాయా? నోట్ల రద్దు ప్రకటన వెలువడిన వెంటనే ప్రధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. తాను రాసిన లేఖ వల్లే పెద్ద నోట్ల రద్దుకు మోడి నిర్ణయించినట్లు ప్రచారం చేసుకున్నారు.

రెండు రోజుల తర్వాత ప్రజల్లో మొదలైన వ్యతిరేకతను గమనించారు. దాంతో నోట్ల రద్దు నిర్ణయంలో తన ప్రమేయం లేదన్నట్లుగా మాట్లాడారు. పది రోజుల తర్వాత నోట్ల రద్దు వల్ల తలెత్తిన సమస్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. నోట్ల రద్దై ఇన్ని రోజులైనా తలెత్తిన సమస్యలను కేంద్రం పరిష్కరించటంలో విఫలమైందన్నారు. తన జీవితంలో ఇంతటి సంక్షోభాన్ని ఎన్నడూ చూడలేదని మరో రోజన్నారు. రాష్ట్రానికి సరిపడి నగదు నిల్వలను కేంద్రం పంపటం లేదని మండిపడ్డారు. బ్యాంకర్లు సక్రమంగా పనిచేయటం లేదని వారిపై ధ్వజమెత్తారు. ఫిర్యాదు కూడా చేసారు.

రూ. 100 నోట్లు కాకుండా కేవలం రూ. 2 వేల నోట్లను పంపుతున్నందు వల్లె సమస్యలు పరిష్కారం కావటం లేదని ఆర్బిఐపై ధ్వజమెత్తారు. తాజాగా గురువారం జరిగిన టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దును ‘చారిత్రాత్మక ఆర్ధిక సంస్కరణ’గా అభివర్ణించారు. దేశ చరిత్రలోనే ఇదొక నూతన మార్పుగా వర్ణించారు. దీనికి ప్రజలందరూ అలవాటు పడాలని సూచించారు. నోట్ల రద్దు వల్ల తలెత్తిన సంక్షోభం తాత్కాలికమేనన్నారు.

పనిలో పనిగా చంద్రబాబు మరో మాట కూడా అన్నారు. సమస్య పరిష్కారానికి బ్యాంకర్లు తమ సమర్ధత నిరూపించుకునే అవకాశం వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం నగదు లభ్యతే అసలైన సమస్య. అయితే, ఇక్కడ సమర్ధత ప్రస్తావన అవసరం లేదు. ఎందుకంటే, బ్యాంకర్లు ఎంత సమర్ధులైనా ఆర్బిఐ నగదు పంపకపోతే సమస్య పరిష్కారం కాదు. సమర్ధతను నిరూపించుకోవాల్సింది బ్యాంకర్లు, అధికారులు, ప్రభుత్వ సిబ్బంది కాదు. అదనపు నిధులు రావాలంటే సమర్ధత నిరూపించుకోవాల్సింది చంద్రబాబే.