పాత నోట్లతో సహకార బ్యాంకుల్లో రుణాల బకాయిలు చెల్లించుకునేలా వెసులుబాటు ఇవ్వండి - బాబు
తొందరగా నోట్ల కొరత తీర్చి ప్రజలు ఇబ్బందులు తీర్చక పోతే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకత వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కొద్దిసేపటికిందట అమరావతిలో ఆయన బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు ఇబ్బంది పడుతున్న సంగతిని అంగీకరించారు.
పాత 500, 1000 నోట్లతో సహకార బ్యాంకుల్లో రైతులు తమ వ్యవసాయ రుణాల బకాయిలు చెల్లించుకునేలా వెసులుబాటు ఇచ్చేందుకు కేంద్రం అనుమతి నివ్వాలని కూడా బాంక్ అధికారులను కోరారు.
’ప్రజలను ఇబ్బంది పెట్టకూడదనేదే నా ఉద్దేశం‘ అని ఆయన సీఎం స్పష్టం చేశారు.
పెద్ద నోట్ల రద్దున స్వాగతించి, ఆ తర్వాత రద్దయింది పెద్దనోట్లు కాదు,కేవలం పాతనోట్లే నని తెలుసుకున్నాక ఆయన కొంచెం ఇబ్బంది పడ్డారు. ఇపుడు బ్యాంకుల దగ్గిర, ఎటిఎం దగ్గిర క్యూలు పెరగడం, కాంగ్రెస్ ఉద్యమాలు, చేపట్టడం, ప్రతిపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ ‘బాబు కు నోట్ల రద్దు సమాచారం ముందే తెలుసు’ అనే క్యాంపెయిన తీసుకోవడంతో ఆయన ఇపుడు ప్రజా పక్షం తీసుకుంటున్నట్లుంది.
వీలైనంతవరకు ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి కావాల్సిన మేర నోట్లు తీసుకురాగలగాలని, దీనికి అన్ని బాంకులు కృషిచేయాలని ఆయన అన్నారు.
’ఇ పాస్ మిషన్, మొబైల్-నెట్ బ్యాంకింగ్ లావాదేవీలకు అదనపు చార్జీలు వసూలు చేయడంతో నగదు రహిత లావాదేవీలకు స్పందన తక్కువగా ఉంది, ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నా. ఆంద్రప్రదేశ్ లో ఆర్ధిక లావాదేవీలు స్థంభించకుండా చూసేందుకు ఆన్లైన్ లావాదేవీలు ఎక్కువగా జరిగేలా చర్యలు తీసుకోవాలి,’ అని ముఖ్యమంత్రి సూచించారు.
జన్ ధన్ ఖాతాలు అన్నీ ఆక్టివేట్ చేయాలని ఆయన బ్యాంకు అధికారలకు సలహా ఇచ్చారు.
