పార్టీ నేతల వరస చూస్తుంటే పార్టీని నీడలా వెన్నాడుతున్న ఆగస్టు సంక్షోభం మరికాస్త ముందే వచ్చేస్తుందా? అన్న అనుమానాలు మొదలయ్యాయి.
ఫిరాయింపులకు మంత్రి పదవులు ఇచ్చే విషయంలో చంద్రబాబునాయుడు పెద్ద డ్రామానే నడిపారు. ఒకసారి గవర్నర్ వద్దంటున్నారని, మరోసారి రాజ్యాంగ విరుద్ధమంటున్నారని...ఇలా రకరకాల డ్రామాలకు తెరలేపి చివరకు తాను అనుకున్న వారిని మంత్రిపదవుల్లో కూర్చో బెడుతున్నారు. ఇదంతా చూస్తుంటే ఒకటి మాత్రం నిజమనిపిస్తోంది. పార్టీలోని సీనియర్లను, మంత్రిపదవులను ఆశిస్తున్నవారికి మంత్రివర్గం నుండి దూరంగా ఉంచేందుకే రాజ్యంగమని, గవర్నర్ అని కథలు ప్రచారం చేయించారు.
కొత్తగా కొలువుదీరబోయే మంత్రివర్గంలో ఏకంగా నలుగురు ఫిరాయింపు ఎంఎల్ఏలకు చోటు ఇవ్వటంతో పార్టీలో కలకలం మొదలైంది. భూమా అఖిలప్రియ, అమరనాధరెడ్డి, ఆదినారాయణరెడ్డి, సుజయ కృష్ణ రంగారావులకు చోటు కల్పిచారు. అంటే వీరికి చోటు కల్పంచేందుకే ఇంత డ్రామా నడిపారన్నది స్పష్టమైపోయింది. దానిపైనే సీనియర్ నేతలు చంద్రబాబుపై మండిపడుతున్నారు. దూళిపాళ నరేంద్ర, పయ్యావుల కేశవ్, బండారు సత్యనారాయణ, గౌతు శ్యామ్ సుందర శివాజి, ఆలపాటి రాజేంద్రప్రసాద్ లాంటి ఎందరో సీనియర్ నేతలు చంద్రబాబు వైఖరిపై మండిపడుతున్నారు.
ఇక, మంత్రిపదవి నుండి తొలగించటాన్ని అవమానంగా భావిస్తూ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఏకంగా ఎంఎల్ఏ పదవికి కూడా రాజీనామా చేసారు. మరికొందరు ఎంఎల్ఏలు కూడా అదే బాటలో నడుస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఇంకా పలువురు అదే బాటలో ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. పార్టీ నేతల వరస చూస్తుంటే పార్టీని నీడలా వెన్నాడుతున్న ఆగస్టు సంక్షోభం మరికాస్త ముందే వచ్చేస్తుందా? అన్న అనుమానాలు మొదలయ్యాయి.
