ఎంఎల్ఏలు, మంత్రుల మధ్య పంచాయితీలు చంద్రబాబు కూడా పరిష్కరించలేని స్ధితికి చేరుకున్నాయి.
వెనకటికి ఒకడు ‘లేస్తే మనిషిని కానం’టూ కాలం వెళ్లబుచ్చేవాడట. అలాగే ఉంది చంద్రబాబునాయుడు వ్యవహారం. మొగ్గలో ఉన్నపుడే తుంచేయాల్సిన క్రమశిక్షణా రాహిత్యం పెరిగిపోయేంత వరకూ ఉపేక్షించింది చంద్రబాబే. దాంతో చాలా జిల్లాల్లో మంత్రులకు ఎంఎల్ఏలకు పడటం లేదు. మరికొన్ని జిల్లాల్లో మంత్రుల మధ్యే రచ్చ జరుగుతోంది. ఎంఎల్ఏల మధ్యా తీవ్రస్దాయిలో గొడవలవుతున్నాయి. ఫిరాయింపు ఎంఎల్ఏలు వచ్చిన తర్వాత మరింత పెరిగిపోయాయి. ఎంఎల్ఏల అనుచరులు, నేతల అనుచరులైతే బాహాటంగానే రోడ్లపై కొట్టేసుకుంటున్నారు. ఇవన్నీ తరచూ మీడియాలో కనిపిస్తున్నవే. ఎంఎల్ఏలు, మంత్రుల మధ్య పంచాయితీలు చంద్రబాబు కూడా పరిష్కరించలేని స్ధితికి చేరుకున్నాయి.
తాజాగా జరిగిన పార్టీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ మంత్రులు వేరే అంశాల్లో ఎంటర్ కావటం సరికాదని బుద్దులు చెప్పారు. ‘వేరే అంశాల’న్నారే గానీ అవేంటో మాత్రం చెప్పలేదు. అలాగే, చాలామంది ఎంఎల్ఏలు ఒంటెత్తుపోకడ పోతున్నట్లు చెప్పారు. ఎంఎల్ఏలు-ఎంపిల మధ్య సయోధ్య లేదని చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. హోలు మొత్తం మీద చూస్తే చాలా జిల్లాల్లో పార్టీలో తమ్ముళ్ళు క్రమశిక్షణ తప్పినట్లు చంద్రబాబే అంగీకరించారన్నమాట. చింతమనేని ప్రభాకర్, జెసి ప్రభాకర్ రెడ్డి, బోడె ప్రసాద్ లాంటి ఎంఎల్ఏలను స్వయంగా చంద్రబాబే వెనకేసుకొస్తే ఇక ఎంఎల్ఏల్లో క్రమశిక్షణ ఎలాగుంటుంది.
ప్రభుత్వ యంత్రాంగం మీద విచక్షణా రహితంగా దాడులు చేస్తున్న తమ్ముళ్లను ఆపే స్ధితిలో కూడా చంద్రబాబు లేరన్న సంగతి అందరికీ అర్ధమైపోయింది. ప్రభుత్వ అధికారులపై దాడులకు తెగబడ్డ నేతలపై సిఎం ఇంతవరకూ చర్యలు ఎందుకు తీసుకోలేదు? వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రజాప్రతినిధుల్లో కొందరు అడ్డదిడ్డమైన సంపాదనకు లాకులెత్తారు. ఈ విషయాలేవీ చంద్రబాబుకు తెలీకుండా జరగటం లేదు. పాలనా విషయాల్లో తాను చాలా కఠినంగా ఉంటానని బిల్డప్ ఇవ్వటమే ఉద్దేశ్యంగా కనబడుతోంది. అదే సమయంలో త్వరలో మంత్రివర్గ ప్రక్షాళన అంటున్నారు. పలువురికి ఉధ్వాసన తప్పదని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. తొలగించేవాళ్లకు సమాధానం చెప్పుకునేందుకు ఇప్పటి నుండే చంద్రబాబు ఓ వాదనను సిద్ధం చేసుకుంటున్నారేమో.
