Asianet News TeluguAsianet News Telugu

కేసులున్నా ఒప్పందాలు చేసేసుకున్నారు

ఎన్నికేసులున్నా, విచారణ ఏ దశలో ఉన్నా ఏమాత్రం లెక్క చేయకుండా చంద్రబాబు ఈరోజు సింగపూర్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవటం గమనార్హం.

Naidu going ahead with capital construction despite cases in courts

ముందస్తు ఎన్నికల సంకేతాలతో చంద్రబాబునాయుడు రాజధాని నిర్మాణానికి సంబంధించి హడావుడిని పెంచేసారు. స్విస్ ఛాలెంజ్ పద్దతిలో సింగపూర్ కంపెనీలతో ఒప్పందాలపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి. రాజధాని ప్రాంతంలోని రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన కేసులు కొన్ని వేలున్నాయి. రాజధాని నిర్మాణానికి ఎంపిక చేసిన స్ధలంపైనే నేషరల్ గ్రీన్ ట్రైబ్యునల్లో విచారణ సాగుతోంది. ఎన్నికేసులున్నా, విచారణ ఏ దశలో ఉన్నా ఏమాత్రం లెక్క చేయకుండా చంద్రబాబు ఈరోజు సింగపూర్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవటం గమనార్హం.

రాజధాని ప్రాంతంలోని స్టార్టప్ ప్రాంత అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వానికి, సింగపూర్ కంపెనీలకు మధ్య అవగాహనా ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, నూతన రాజధాని అచ్చం సింగపూర్లా ఉండాలని మొదటి నుండి అనుకున్నట్లు చెప్పారు. ఏపికి, సింగపూర్ కు ఎన్నో సారూప్యతులున్నాయట. గతంలో కూడా తానే హైదరాబాద్ ను అభివృద్ధి చేసానని చెప్పుకున్నారు. కృష్ణానది మన రాజధానికి అదనపు బలం అవుతుందని సిఎం ఆశించారు.

కృష్ణానదికి ఇరువైపులా 40 కిలోమీటర్ల పరిధిలో అభివృధి జరుగుతుందన్నారు. సింగపూర్ ఎంతో క్రమశిక్షణ కలిగిన దేశంగా చంద్రబాబు పేర్కొనటం గమనార్హం. అందరూ రాజధాని నిర్మాణం అసాధ్యమని అన్నారట. అయితే, దేశంలో ఎక్కడా లేని విధంగా రూ. 40 వేల కోట్ల విలువైన 33 వేల ఎకరాలను రూపాయి ఖర్చు లేకుండా రైతులు అందించినట్లు సిఎం చెప్పటం విశేషం. ఆరంభంలో కొన్ని చిక్కులు ఎదురైనా అన్నింటినీ అధిగమించి స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సింగపూర్ సంస్ధలతోనే ఎంఓయు చేసుకున్నట్లు చంద్రబు ప్రకటించారు.

రెండేళ్ళల్లో సామర్ధ్యం చూపాలంటూ సింగపూర్ కంపెనీలను సిఎం కోరారు. ఉద్యోగాల సృష్టి, సంపద సృష్టి జరిపే రాజధాని కావాలంటూ కాంక్షించారు. సింగపూర్ కంపెనీల తరపున సింగపూర్ మంత్రి ఈశ్వరన్, ఏపి ఉన్నతాధికారులు ఒప్పందాలపై సంతకాలు చేసారు. ఏపి ఆర్ధికాభివృద్ధి, రాజధాని స్టార్టప్ ఏరియా అభివృద్ధి, ప్రభుత్వ విభాగాల్లో సామర్ధ్యం పెంపు, ద్యైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల ప్రోత్సాహానికి అవసరమైన సహకారం సింగపూర్ కంపెనీలు అందిస్తాయి. ఒప్పందాల్లో భాగంగా సింగపూర్ కంపెనీలకు రాష్ట్రప్రభుత్వం 1691 ఎకరాలను అందచేస్తుంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios