చంద్రబాబునాయుడు అనుకుని ఉండరు. తన నాయకత్వంలోనే తెలంగాణా టిడిపికి ఇంతటి దీనస్ధితి వస్తుందని. రేవంత్ రెడ్డి రూపంలో ఊహించని పరిణామం ఎదురవటంతో షాక్ తిన్నారు. రేవంత్ టిడిపికి రాజీనామా చేసినపుడు చంద్రబాబును ఒకవైపు ఆకాశానికి ఎత్తేస్తూనే ఇంకోవైపు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. తనతో పాటు మెజారిటీ నేతలను టిడిపిలో నుండి లాక్కెళ్ళిపోయారు. రేవంత్ తో పాటు ఇంత భారీస్ధాయిలో నాయకులు టిడిపిని వదిలేస్తారని చంద్రబాబు కూడా అనుకుని వుండరు. అందుకే అంతలా షాక్ తిన్నారు.

తెలంగాణాలోని 31 జిల్లాల అధ్యక్షుల్లో 22 జిల్లాల అధ్యక్షులు రేవంత్ తో పాటు కాంగ్రెస్ లో చేరటానికి సిద్దంగా ఉన్నట్లు ప్రచార జరుగుతోంది. ఇప్పటికే సుమారు 8 జిల్లాల అధ్యక్షులు రాజీనామాలు చేసేసారు. మరో 6 మంది రాజీనామాకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. మిగిలిన వారు కూడా కొద్ది రోజుల్లో టిడిపిని వదిలేయటానికే నిర్ణయించుకున్నట్లు టిడిపి వర్గాలు చెబుతున్నాయి.

రేవంత్ తో పాటు టిడిపికి రాజీనామా చేసిన వారిలో పలువురు పార్టీతో దశాబ్దాల అనుబంధం ఉన్నవారే. అయినా సరే, తెలంగాణాలో టిడిపి ప్రస్తుత పరిస్ధితితో పాటు తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే రేవంత్ తో పాటు కాంగ్రెస్ లో చేరుతున్నారు. వలసలను ఆపేందుకు చంద్రబాబు పెద్ద ప్రయత్నమే చేసినట్లు సమాచారం. అందుకు తగ్గట్లే కాంగ్రెస్ కూడా టిడిపిలో నుండి వచ్చే వారికి తగిన హామీలిచ్చిందట. అందుకే ఒక్కసారిగా టిటిడిపిని వదిలేస్తున్నారు.

టిడిపికి రాజీనామా చేయాలనుకుంటున్న నేతలను ఆపాలంటూ తెలంగాణా అధ్యక్షుడు ఎల్ రమణ, సీనియర్ నేతలు మోత్కుపల్లి నరసింహులు, అరవింద్ కుమార్ గౌడ్, కొత్తకోట ప్రకాశ్ రెడ్డి లాంటి నేతలకు చంద్రబాబు బాధ్యత అప్పగించారట. అయినా, వీరి మాట ఎవరూ వినలేదు. ఎందుకంటే, వలసలను ఆపటానికి ప్రయత్నిస్తున్నవారెవరికీ తెలంగాణాలో టిడిపిని బ్రతికించుకునే సామర్ధ్యం లేదన్న విషయం అందరికీ తెలుసు. దాంతో చేసేదిలేక చంద్రబాబు కూడా మౌనంగా ఉండిపోయారు.