ఎట్టకేలకు చంద్రబాబునాయుడు కొత్తమంత్రివర్గంలో చేరబోయే వారి జాబితాను సిద్ధం చేసారు. 11 మందిని కొత్తగా తీసుకోవాలని నిర్ణయించిన సిఎం ప్రస్తుత మంత్రివర్గం నుండి ఐదుగురికి ఉధ్వాసన పలికారు. ఆదివారం ఉదయం 9.22 గంటలకు వెలగపూడి సచివాలయంలో ప్రమాణ స్వీకారం జరుగుతుంది. కొత్తగా మంత్రివర్గంలో చేరబోయే వారిలో ఫిరాయింపు ఎంఎల్ఏలకు కూడా అవకాశం ఇచ్చారు. కిమిడి మృణాళిని, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, రావెల కిషోర్ బాబు, పల్లె రఘునాధరెడ్డి, పీతల సుజాతలకు ఉధ్వాస పలికారు.

కొత్తగా చేరబోయే వారిలో నారా లోకేష్, నక్కా ఆనందబాబు, కాళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సుజయ కృష్ణారావు, భూమా అఖిలప్రియ, అమరనాధరెడ్డి, ఆదినారాయణ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, జవహర్, అత్తార్ చాంద్ భాష ఉన్నారు. వీరిలో సుజయ, భూమా, అమరనాధ్, ఆదినారాయణరెడ్డి, అత్తార్ వైసీపీ తరపున గెలిచి అధికార పార్టీలోకి ఫిరాయించారు. వీరందరికి ఆదివారం ఉదయానికల్లా సచివాలయానికి చేరుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి సమాచారం అందించారు.

ఫిరాయింపులకు ఎంఎల్ఏలకు మంత్రిపదవులు ఇస్తే సహించమంటూ పలువురు ఎంఎల్ఏలు ఏకంగా చంద్రబాబుతోనే చెప్పారు. అయినా వారి మాటను ఖాతరుచేయలేదు. ఆదినారాయణరెడ్డికి ఇస్తే పార్టీలో ఉండబోనంటూ జమ్మలమడుగు నేత రామసుబ్బారెడ్డి చంద్రబాబుతోనే స్పష్టం చేసినా పట్టించుకోలేదు. అలాగే, సుజయకు మంత్రివర్గంలోకి తీసుకోవద్దని విజయనగరం జిల్లాలోని పలువురు ఎంఎల్ఏలు సిఎంకు స్పష్టంగా చెప్పినా వినలేదు. అదేవిధంగగా అత్తార్ కు మంత్రి పదవి ఇవ్వవద్దంటూ అనంతపురం జిల్లాలోని పలువురు ఎంఎల్ఏలు చంద్రబాబుకు చెప్పిన మాటలను ఖాతరు చేయలేదు. దాంతో పలు జిల్లాల్లోని ఎంఎల్ఏలు, నేతలు చంద్రబాబు వైఖరిపై మండిపడుతున్నారు. రాబోయే రోజుల్లో మంత్రివర్గ ప్రక్షాళన ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.