చంద్రబాబుకు అన్నీ ఎదురుదెబ్బలే

First Published 18, Nov 2017, 12:56 PM IST
naidu faces too many hurdles is centre non cooperative to AP
Highlights
  • వెంకయ్యనాయుడు క్రియాశీల రాజకీయాల్లో లేని లోటు చంద్రబాబునాయుడు విషయంలో కొట్టొచ్చినట్లు కనబడుతోంది.

వెంకయ్యనాయుడు క్రియాశీల రాజకీయాల్లో లేని లోటు చంద్రబాబునాయుడు విషయంలో కొట్టొచ్చినట్లు కనబడుతోంది. పోయిన ఎన్నికల్లో టిడిపి-భాజపాలు కలిసి పోటీ చేయటంలో వెంకయ్య పాత్రే ఎక్కువుంది. నరేంద్రమోడి ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చంద్రబాబును దూరంగా పెట్టటం మొదలుపెట్టారు. ఆ విషయం ఎన్నో సార్లు స్పష్టంగా కనబడుతున్నా కేంద్రమంత్రిగా వెంకయ్య ఉన్న కారణంగా చంద్రబాబు ఏదోలా నెట్టుకొచ్చే వారు. ఎప్పుడైతే వెంకయ్యను మోడి ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేశారో అప్పటి నుండే చంద్రబాబుకు సమస్యలు మొదలయ్యాయి.

ఉపరాష్ట్రపతిగా వెళ్ళటం తనకు ఇష్టం లేదని వెంకయ్య ఎంత మొత్తుకున్నా మోడి వెనక్కు తగ్గలేదు. దాంతో ఉపరాష్ట్రపతిగా వెంకయ్య బాధ్యతలు తీసుకోక తప్పలేదు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రప్రయోజనాలను కేంద్రం పట్టించుకోకపోయినా వెంకయ్య, చంద్రబాబులకు చీమ కుట్టినట్లు కూడా అనిపించలేదు. ఏ విషయంలో కూడా కేంద్రాన్ని నిలదీయలేని స్దితిలో చంద్రబాబు కూరుకుపోయారు. దాంతో  కేంద్రం ఆడిందే ఆటగా సాగుతోంది. తాజాగా డిజిపి ఎంపిక కూడా అటువంటిదే. తనకు నమ్మకస్తుడైన ఐపిఎస్ అధికారిని కూడా చంద్రబాబు డిజిపిగా ఎంపిక చేయించుకోలేకపోతున్నారు.

ఈ విషయంలో చంద్రబాబు తప్పు కూడా ఉంది. దాదాపు ఏడాదిన్నర కాలంగా సాంబశివరావును డిజిపి ఇన్ చార్జిగా ఉంచి ఉద్యోగ విరమణ చేసే ముందు పూర్తి కాలం డిజిపిగా నియమించాలని సిఫారసు చేస్తే కేంద్రం ఎందుకు ఒప్పుకుంటుంది? ఏడాదిన్న ర క్రితమే సాంబశివరావును పూర్తి స్దాయి డిజిపిగా ఎందుకు నియమించలేదన్న ప్రశ్నకు చంద్రబాబు నుండి సామధానం లేదు. చంద్రబాబులో చాలా లోపాలున్నాయి కాబట్టే కేంద్రం కూడా ఓ రేంజిలో ఆడుకుంటోంది.

విభజన చట్టాన్ని తుంగలో తొక్కటం కావచ్చు, పోలవరంకు నిధులు మంజూరు విషయం, పోలవరం కాంట్రాక్టర్ ను మార్చే అంశం, రాజధానికి నిధుల కేటాయింపు, తాజాగా డిజిపి వ్యవహారం కావచ్చు. విషయమేదైనా సరే చంద్రబాబుకు కేంద్రం వద్ద ఎదురు దెబ్బలే తగులుతున్న విషయం వాస్తవం. అంతెందుకు ఏడాదిన్నరగా ప్రధానమంత్రి చంద్రబాబుకు అపాయింట్మెంటే ఇవ్వటం లేదంటేనే పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు. మిత్రపక్షాలుగా ఉన్నపుడే పరిస్ధితి ఇలా వుంటే వచ్చే ఎన్నికల్లో భాజపా ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు పరిస్ధితి ఇంకెలాగుంటుందో ?

 

 

 

loader