Asianet News TeluguAsianet News Telugu

ఇక చాలు, మోయలేక పోతున్నాం మోదీ గారూ

మోదీ నిర్ణయం వల్ల  బిజెపి కంటే టిడిపికే ఎక్కువ నష్టమని  బాబు అనుకుంటున్నారా?   నోట్ల రద్దు మీద

ముఖ్యమంత్రి స్వరమే కాదు,  మంత్రుల, పార్టీ నేతల మాట తీరు కూడా మారుతూ వస్తున్నది. 

Naidu distancing from Modis decision

రోజు రోజుకు ప్రధాని నోట్ల మీద  ప్రజలలో పెరుగుతున్న అక్కసు, అసలు పార్లమెంటులో కాలుపెట్టేందుకే మోదీ జంకుతూ ఉండటంతో  తెలుగుదేశం పార్టీ నోట్ల వ్యూహం మార్చినట్లు కనిపిస్తావుంది.

 

దీనికి స్పష్టమయిన నిదర్శనం మెల్లిగా నోట్ల రద్దును పొగడటం మానేసి, ప్రజల కష్టాలను ప్రస్తావించాలనుకోవడమే. నిన్న జరిగిన బ్యాంకర్ల సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తొందరగా ఈసమస్యకు పరిష్కారం కనుగొనకపోతే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ప్రజల్లో వ్యతిరేక వస్తుందని హెచ్చరించారు.  నిజానికి ఇలాంటి మాటలను ఆయన బ్యాంకర్ల సమావేశంలో అనడమే విశేషం. మోదీ దుష్ఫ్రభావం తెలుగుదేశం ప్రభుత్వం మీద కూడా పడుతూ ఉందని పార్టీ ఆందోళన చెందుతుండటమే దీనికి కారణమంటున్నారు.

 

మోదీ నిర్ణయం వల్ల రాజకీయంగా బిజెపి కంటే టిడిపికే ఎక్కువ నష్టం కలిగిస్తుందని పార్టీ భావిస్తోంది. ముఖ్యమంత్రి స్వరమే కాదు, గత రెండురోజులలో  మంత్రులు, పార్టీ నేతల స్వరం పరిశీలించినా ఈ పరివర్తన స్పష్టంగా కనిపిస్తింది.

 

మిత్ర పక్షమని మోదీని, ఉత్తరం రాసిన నేరానికి ద్దనోట్ల రద్దును జనం వ్యతిరేకత మధ్య వెనకేసుకురావడం కంటే,  ఎక్కడ బడితే అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రస్తావించడం వల్ల   మోదీ మరకను కడిగేసుకోవచ్చని  తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్లుంది.

 

పెద్దనోట్ల రద్దుపై ముందు అతిగా మాట్లాడటం తప్పేనని పార్టీ నేత చెంపలేసుకుంటున్నట్లు పార్టీ వారు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆయన కొంత మంది మంత్రులు అ ధికారులు ఉన్న ఒకసమావేశంలో అన్నట్లు కూడా తెలిసింది. అందుకే మేల్కొనాలనే నిర్ణయానికి వచ్చారట.


 

గతంలో పెద్దనోట్ల రద్దు మహత్తర నిర్ణయంగా మాట్లాడుతూ వచ్చిన  చంద్రబాబు,  హఠాత్తుగా ఇప్పుడు జనం పడుతున్న కష్టాల గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. బ్యాంకర్ల సమావేశంలో ఆయన  ఉపన్యాసం వింటే ఇది అర్థమవుతుంది. పది రోజులు దాటినా కొలిక్కి కాని సమస్యను తన రాజకీయ జీవితంలో ఇప్పుడే చూస్తున్నానని చంద్రబాబు కూడా అనడం గమనించాలి.


టిడిపి చిత్తూరు ఎంపి డాక్టర్ శివప్రసాద్ నేరుగా నిరసన విచిత్రప్రదర్శన నిర్వహించడంతోపాటు, ప్రధాని మీద  ఆసక్తికరమైనవ్యాఖ్యలు చేశారు. పార్టీ లైన్ మారిన సంకేతాలు లేకపోతే, ఆయనకు ఇంత ధైర్యం వస్తుందా? 

 

ఎన్నికల్లో భార్యపిల్లలు లేని వారిని అనర్హులుగా ప్రకటించాలనడం మోదీ మీద ఎక్కు పెట్టిన రాజకీయ బాణమే.


ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా, నోట్ల రద్దు రుద్దడం వల్లే  ఈ పరిస్థితి వచ్చిందని, దానికి ప్రజలు ఇబ్బందులు పడుతుండటం బాధాకరమని వ్యవసాయ  మంత్రి పత్తిపాటి పుల్లారావు అంటున్నారు.   పనిలో పనిగా, ఇలాంటి సమయాలలో అదుకునే శక్తి చంద్రబాబు నాయుడికే ఉందని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లకోసం ముఖ్యమంత్రి  కృషి చేస్తున్నారని ఆయన ప్రజలకు నచ్చ చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మోదీ కంటే బాబే ఘనడని అర్థమొచ్చేలా ప్రధాని మోదీ అనుభవజ్ఞుడైన చంద్రబాబు సలహాలు తీసుకుంటే ఈ సమస్య వచ్చేదికాదని కూడా అంటున్నారు.

 

నియోజకవర్గాలలో పర్యటిస్తున్నపుడు మంత్రులను, ఎమ్మెల్యేలను నోట్ల కష్టాలపై ప్రజలు నిలదీస్తూ ఉండటం కూడా  దీనికి కారణమని తెలుస్తోంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios