ప్రధానమంత్రి-చంద్రబాబునాయుడు సమావేశం ముగిసింది. రాష్ట్ర విభజన సమస్యలు, అసెంబ్లీ సీట్ల పెంపు, పోలవరం నిధులు తదితరాలపై చంద్రబాబు ప్రధానికి వివరించారు. వీరిద్దరి భేటి దాదాపు గంటపాటు జరిగింది. వివిధ ప్రాజెక్టులకు విదేశీ ఆర్దిక సంస్ధల నుండి నిధులు ఇప్పించే విషయం తదితరాలపై సుదీర్ఘంగా చంద్రబాబు వివరించారు. మొత్తం మీద ప్రదానికి చంద్రబాబు వివిధ అంశాలపై 17 పేజీల నోట్ ను అందించారు.

దాదాపు ఏడాదిన్నర తర్వాత ప్రధాని చంద్రబాబుతో భేటీ అయ్యారు. వివిధ సందర్భాల్లో ప్రధానితో భేటీ విషయమై చంద్రబాబు ఎంత ప్రయత్నించినా అపాయిట్మెంట్ ఇవ్వని విషయం అందరికీ తెలిసిందే. అయితే, మొన్ననే టిడిపికి చెందిన కేంద్రమంత్రులు, ఎంపిలు ప్రధాని కాళ్ళా వేళ్ళా పడిన తర్వాత చివరకు చంద్రబాబును కలవటానికి ప్రధాని అంగీకరించారు.

 

 

ఏడాదిన్నరగా ముఖ్యమంత్రిని కలవటానికి ఇష్టపడని ప్రధాని అదే సమయంలో ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి చివరకు లక్ష్మీపార్వతిని కూడా కలిసారు. మిత్రపక్ష నేత, ముఖ్యమంత్రిని కాదని ప్రధాన ప్రతిపక్ష నేతను ప్రధాని కలవటం బహుశా ఒక్క ఏపి విషయంలో జరిగిందేమో. నిజానికి ప్రధాని వైఖరి చంద్రబాబుకు పెద్ద అవమానంగా భావించాలి. అదే విషయాన్ని టిడిపి కేంద్రమంత్రులు, ఎంపిలు ప్రధానిని కలిసినపుడు ప్రస్తావించినట్లు సమాచారం. దాంతో చంద్రబాబును కలవటానికి ప్రధాని అంగీకరించారు.

కేంద్రమంత్రులు, ఎంపిలతో వెళ్ళి ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రధానిని చంద్రబాబు కలిసారు. రాష్ట్ర సమస్యలు ఏకరువుపెట్టిన తర్వాత వారిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకున్నారు. అప్పటి భేటీలో ఏమి జరిగిందన్నది సస్పెన్సే.