ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంద రోజుల పాలనపై జనసేన నాయకుడు, సినీ నటుడు నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వంద రోజుల జగన్ పాలన వైఫల్యాలపై, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో చూపుతున్న అలసత్వంపై, అవగాహనరాహిత్యంపై పోరాటం చేయడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. 

ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం రెండు రోజుల సమీక్ష కోసం ఆయన బుధవారం ఇక్కడికి వచ్చారు. గత ఎన్నికల అనుభవాలను సమావేశంలో వివరించారు. పార్టీకి అండగా నిలబడుతామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని అన్నారు. సమావేశానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.

పవన్ కల్యాణ్ బ్రహ్మాస్త్రంలాంటివాడని, ఆ అస్త్రాన్ని సక్రమంగా వాడుకుంటే ప్రజలు సమస్యల నుంచి విముక్తి అవుతారని, రాష్ట్రం బాగుపడాలని పరితపించే నాయకుడు పవన్ కల్యాణ్ అని ఆయన అన్నారు. సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతో పవన్ జనసేనను స్థాపించారని చెప్పారు. 

భవిష్యత్తులో చిరంజీవి అభిమానులను కలుపుకుని ముందుకు సాగుతామని నాగబాబు చెప్పారు. కార్యకర్తలకు మనోధైర్యం కల్పించడానికి, పార్టీ లక్ష్యాలను వారికి తెలియజేయాలని రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నట్లు ఆయన తెలిపారు.