హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్లు వచ్చిన వార్తలపై ఆయన సోదరుడు, జనసేన నేత, సినీ నటుడు నాగబాబు స్పందించారు. అయితే, ఆయన వైఎస్ జగన్ పేరును గానీ వైసీపీని గానీ ప్రస్తావించలేదు. చిరంజచీవికి ఓ పార్టీ రాజ్యసభ సభ్యత్వం ఇస్తుందనే ప్రచారంలో వాస్తవం లేదని ఆయన అన్నారు. 

చిరంజీవికి జనసేనతోనే కాకండా ఏ పార్టీతోనూ ప్రస్తుతం సంబంధం లేదని ఆయన అన్నారు. యూట్యూబ్ చానెల్ లో ఆయన మాట్లాడారు. పవన్ కల్యాణ్ ఆలోచనలను అన్నయ్యగా చిరంజీవి సమర్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం అంటూ కొన్ని వెబ్ సైట్లు తప్పుడు వార్తలతో గందరగోళం సృష్టిస్తున్నాయని ఆయన అన్నారు. 

తన జీవితాన్ని చిరంజీవి సినిమాలకే అంకితం చేయాలని నిర్ణయించుకున్నట్లు నాగబాబు చెప్పారు. ఆ ఉద్దేశంతోనే ఆయన రాజకీయాలను వదిలేసి సినిమాలపై మళ్లీ దృష్టి పెట్టారని ఆయన చెప్పారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారని, ఈ ఏజాది చివరినాటికి ఆ సినిమా ప్రారంభం కానుందని ఆయన చెప్పారు.  ఏ పార్టీలోకి వెళ్లినా చిరంజీవికి గొప్ప స్వాగతం లభిస్తుందని, రాజ్యసభ సీటు తీసుకోవాల్సిన అవసరం లేదని నాగబాబు అన్నారు. 

తమ్ముడు పవన్ కల్యాణ్ కోసం చిరంజీవి రాజకీయాలను త్యాగం చేశారని ఆయన చెప్పారు. ఇద్దరు ఒకే రంగంలో ఉండడం చిరంజీవికి ఇష్టం లేదని చెప్పారు. చిరంజీవికి అన్ని రాజకీయ పార్టీల నాయకులతో కూడా మంచి సంబంధాలున్నాయని, అంత మాత్రాన ఆయా పార్టీల నిర్ణయాలకు చిరంజీవి వంత పాడడం లేదని అన్నారు. పవన్ కల్యాణ్ కు రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో తాను రాజకీయాల్లో ఉండకూడదని చిరంజీవి నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.