ఎవరేం చేసినా టీడీపీ జనసేన ఓట్ షేర్‌ను చీల్చలేరని జనసేన ప్రధాన కార్యదర్శి కే. నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అభ్యర్ధులు నిలబడిన చోట జనసేన కార్యకర్తలు ఓట్లు వేయరని, జనసేన బరిలో వున్న చోట టీడీపీ సహకరించదని దుష్ప్రచారం జరుగుతోందని నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. టీడీపీ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య నిత్యం మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా జనసేన ప్రధాన కార్యదర్శి కే. నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ క్యాడర్ ఓట్ల బదిలీ తథ్యమన్నారు. టీడీపీ అభ్యర్ధులు నిలబడిన చోట జనసేన కార్యకర్తలు ఓట్లు వేయరని, జనసేన బరిలో వున్న చోట టీడీపీ సహకరించదని దుష్ప్రచారం జరుగుతోందని నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇరు పార్టీల శ్రేణులను గందరగోళానికి గురిచేయడానికే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఎవరేం చేసినా టీడీపీ జనసేన ఓట్ షేర్‌ను చీల్చలేరని నాగబాబు తేల్చిచెప్పారు. దుర్మార్గపు ప్రభుత్వాన్ని దించే క్రమంలో ఉమ్మడి భావజాలంతో పార్టీలు ముందుకెళ్తున్నప్పుడు క్యాడర్, వాళ్లకు ఓట్లేసేవాళ్లు ఖచ్చితంగా కలిసి వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్డీయే కూటమిలో, ఇండియా కూటమిలో ఎన్నో పార్టీలు వున్నాయని.. ఎవరి ఓటు బ్యాంక్ వారిదని, ఓట్లు చీల్చే ప్రసక్తే లేదని నాగబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ జనసేన, టీడీపీ పొత్తులో ఎలాంటి గందరగోళం వుండదని ఆయన పేర్కొన్నారు.
అంతకుముందు గురువారం రాత్రి విజయవాడలో జరిగిన 'విధ్వంసం' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. గత ఐదేళ్ళలో ఆంధ్ర ప్రదేశ్ లో సాగిన వైసిపి పాలన గురించి ప్రముఖ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ ఈ పుస్తకం రాసారు. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు తొలి ప్రతిని పవన్ కల్యాణ్ కు అందజేసారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ... ప్రతిపక్షాలు ఎందుకు కలవాలి? ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎందుకు చీలకూడదు? విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్ర ప్రదేశ్ పునర్నిర్మాణం కోసం పార్టీలు ప్రజల పక్షాన ఎందుకు నిలవాలి? అన్న ప్రశ్నలకు విధ్వంసం పుస్తకంతో జవాబు దొరుకుతుందన్నారు. ఈ పుస్తకాన్ని ఏ రాజకీయ పార్టీకి మద్దతుగానో... మరేదో పార్టీకి వ్యతిరేకంగానో రాయలేదని... ఈ ఐదేళ్లలో ఏం జరిగిందో అదే రాసారన్నారు. కేవలం ప్రజల పక్షాన నిలబడే రచయిన ఈ పుస్తకాన్ని రాసారని పవన్ పేర్కొన్నారు.
అమరావతి రైతుల మీద పడ్డ దెబ్బలు చూసి గుండె చెదిరింది... ఆడపడుచులపై అఘాయిత్యాలు తనను చాలా బాధించాయని పవన్ అన్నారు. త్వరలోనే ఎన్నికలు వున్నాయి కాబట్టి ఇప్పుడు ధైర్యంగా వున్నాం... కానీ వైసిపి అధికారంలోకి వచ్చిన మొదట్లో వారి దాష్టికాలను తట్టుకోగలమా అని భయమేసిందన్నారు. ఈ ఐదేళ్లలో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా బాధితులుగా మారారు... వారు అనుభవించిన బాధలనే విధ్వంసం పుస్తకంలో పొందుపర్చారని అన్నారు. ప్రజల కోసం పనిచేసే జర్నలిస్టులు రచయితగా మారితే ఎలా వుంటుందో ఈ పుస్తకం తెలియజేస్తుందని... ఇది పాలకులకు హెచ్చరిక అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఇక వాలంటీర్ వ్యవస్థపై తాను చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం వక్రీకరించిందని పవన్ తెలిపారు. వాలంటీర్లే రాష్ట్రంలోని మహిళల అదృశ్యానికి కారణమని తాను అనలేదు... వీరి ద్వారా వైసిపి ప్రభుత్వం డేటాను సేకరించి ఎవరిచేతికో ఇచ్చిందని అన్నట్లు వివరించారు. ప్రభుత్వ ఆదేశాలతో వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం పక్కదారి పడుతోందని... తద్వారా నేరాలు జరిగే ఆస్కారం వుందని చెప్పడమే తన ఉద్దేశ్యమన్నారు. అలాగే కొందరు వాలంటీర్లు చేసే పనులు మొత్తం వాలంటీర్ వ్యవస్థకే చెడ్డపేరు తెస్తోందని హెచ్చరించానన్నారు. వాలంటీర్ వ్యవస్థమీద తనకు గౌరవం వుందని పవన్ తెలిపారు.
