ఫైనల్ మ్యాచ్ కోసం ఎలా సన్నద్ధం అవుతారో తిరుపతి ఉపఎన్నికల కోసం ఆ విధంగానే సిద్ధంకావాలని జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.

తిరుపతి ఉప ఎన్నికలను ప్రతి ఒక్క జనసైనికుడు చాలా సీరియస్ గా తీసుకోవాలని... పార్టీ భవిష్యత్తు కోసం ఇదొక వార్మప్ మ్యాచ్ అనుకోవాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచించారు. ఫైనల్ మ్యాచ్ కోసం ఎలా సన్నద్ధం అవుతారో ఈ ఎన్నికల కోసం ఆ విధంగానే సిద్ధంకావాలని పిలుపునిచ్చారు.

సోమవారం సాయంత్రం తిరుపతి పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తిరుపతి పరిధిలోని 33 మండలాల నుంచి జనసేన నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ... అధికార పార్టీ వాలంటీర్ల వ్యవస్థలను ఉపయోగించుకొని దౌర్జన్యాలకు పాల్పడుతుందన్నారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరగకుండా అధికారులపై ఒత్తిడి తీసుకొస్తుందని... క్షేత్రస్థాయిలో బలంగా పనిచేసే ప్రతిపక్ష నాయకులను చిన్న చిన్న కాంట్రాక్టులు ఎరవేసి తమవైపు తిప్పుకుంటుందన్నారు. తీరా గెలిచాక చేసిన కాంట్రాక్టు పనులకు బిల్లులు పాస్ చేయకుండా వేధిస్తుందన్నారు. 

''మన అందరు గుర్తించుకోవాల్సింది పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లా ఈ ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరగడం లేదు. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది. ఓటర్లను మభ్యపెట్టడం కుదరదు'' అని పేర్కొన్నారు.

read more పవన్ కల్యాణే కాబోయే సీఎం : నాదెండ్ల మనోహర్

''2004 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు చాలా సంక్షేమ పథకాలు అమలు చేశాం. ఆరోగ్య శ్రీ, రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు ఇలా చాలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం. వీటిని చూపించే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగాం. 190 సీట్లు వస్తాయని అనుకుంటే 153కే పరిమితం చేశారు. కాబట్టి సంక్షేమమే గెలిపిస్తుందనే భ్రమలో ముఖ్యమంత్రి ఉంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. గెలుపు కోసం ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తుంది. రకరకాల యాడ్స్ ఇచ్చి మన ఆలోచన విధానం మార్చాలని చూస్తుంది'' అని అన్నారు. 

''తిరుపతి పార్లమెంట్ పరిధిలో చాలా సమస్యలు ఉన్నాయి. రైతాంగం ఇబ్బందిపడుతోంది. యువత ఉపాధి లేక వలసలు పోతున్నారు. ఇవన్ని దృష్టిలో పెట్టుకొనే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సీటును బీజేపీకి ఇచ్చారు. ఇక్కడ నుంచి బీజేపీ గెలిస్తే ఈ ప్రాంత సమస్యలపై కేంద్ర పెద్దలతో మాట్లాడి పరిష్కరించవచ్చని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు'' అని నాదెండ్ల వివరించారు.