అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సభ్యుల నియామకానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో ఆయన ఆ విషయంపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. టీటీడీ పాలక మండలి సభ్యత్వం కోసం పోటీ తీవ్రంగా ఉంటుందనే విషయం తెలిసిందే. 

టీటీడీ పాలకమండలి సభ్యులుగా ఉండడాన్ని చాలా మంది ఓ ప్రతిష్టగా భావిస్తారు. ఈ స్థితిలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులు ఆ పదవులకు తమ మనుషులను సిఫార్సు చేయడం పరిపాటిగా మారింది. 

ఈ ఏడాది తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇద్దరి పేర్లను, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఒకరి పేరును సూచించినట్లు తెలుస్తోంది. కేసీటాఅర కావేరీ సీడ్స్ చైర్మన్ జీవీ భాస్కర రావు, సిద్ధిపేట టీఆర్ఎస్ నేత మొరంశెట్టి రాములు పేర్లను జగన్ కు సూచించినట్లు తెలుస్తోంది. 

కేంద్ర హోం మంత్రి అమిత్ షా వి. కృష్ణమూర్తి పేరును సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. గత తెలుగుదేశం ప్రభుత్వం కూడా వి. కృష్ణమూర్తిని టీటీడీ సభ్యుడిగా నియమించింది. తమిళనాడుకు చెందిన భారత సివిల్ సర్వెంట్ అయిన కృష్ణమూర్తి పేరునే అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది. 

ఇండియన్ సిమెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. శ్రీనివాసన్ కు టీటీడీ బోర్డులో జగన్ స్థానం కల్పించే అవకాశం ఉంది. కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన ఇద్దరిని టీటీడీ పాలక మండలి సభ్యులుగా నియమించాలని జగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. 

గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద రావు, యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి పేర్లను జగన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. వైఎస్సార్ కాంగ్రెసు తెలంగాణ కార్యదర్శి శివకుమార్ కు కూడా టీటీడీ బోర్డులో స్థానం కల్పించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పేరును తొలుత నెలకొల్పింది శివకుమారే. ఆ తర్వాత దాన్ని జగన్ పేరు మీదికి మార్చారు. 

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడదు వేమూరి ప్రభాకర్ రెడ్డి సతీమణి వైమూరి ప్రశాంతి రెడ్డిని కూడా టీటీడీ పాలక మండలి సభ్యురాలిగా నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. టీటీడీ బోర్డు సభ్యులుగా మొత్తం 18 మందిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించి ఒక్కటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

టీటీడీ పాలకమండలిపై జగన్ కసరత్తు: పరిశీలనలో కేసీఆర్ మిత్రుడు