టీటీడీ పాలకమండలిపై జగన్ కసరత్తు: పరిశీలనలో కేసీఆర్ మిత్రుడు
టీటీడీ పూర్తిస్థాయి పాలకవర్గాన్ని ఏర్పాటు చేసేందుకు వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు. బుధవారం నాడు పూర్తి స్థాయి పాలకవర్గాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
అమరావతి: టీటీడీ పూర్తిస్థాయి పాలకవర్గం ఏర్పాటు విషయమై ఏపీ సీఎం వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు. బుధవారం నాడు టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. పాలకవర్గం గురించి చర్చించారు. ఇవాళ సాయంత్రానికి పూర్తి స్థాయి పాలకవర్గంపై ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
చంద్రబాబునాయుడు ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో టీటీడీ పాలకవర్గాన్ని 18 మందితో ఏర్పాటు చేశారు. జగన్ సర్కార్ 25 మంది పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించేందుకు గాను ఇప్పటికే 35 మంది పేర్లను జగన్ పరిశీలనలో ఉన్నాయి. వీరిలో 25 మందిని ఎంపిక చేయనున్నారు.కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు, ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ లకు చోటు దక్కనుంది.
ఇక స్థానిక కోటాలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తెలంగాణ నుండి మహా సిమెంట్స్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు, మహిళా కోటాలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతి రెడ్డితో పాటు వైఎస్ఆర్‌సీపీ మహిళా ఎమ్మెల్యేలకు చోటు దక్కే అవకాశం ఉందని సమాచారం.