హైదరాబాద్: ఓ వైపు కేంద్ర ప్రభుత్వంపై సమరం సాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మరోవైపు ప్రత్యేక రాయలసీమ సెగ తగులుతోంది. రాయలసీమ అభివృద్ధికి నోచుకోవడం లేదని, దీంతో ఈ ప్రాంతం యువత తీవ్ర నిస్పృహలో ఉందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఎంవీ మైసురారెడ్డి అన్నారు. 

అది మరో రాష్ట్ర విభజన ఉద్యమానికి దారి తీసే అవకాశం ఉందని, అలాంటి ఉద్యమం తలెత్తితే అందుకు చంద్రబాబు నాయుడి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. 

హైదరాబాదులోని ప్రెస్ క్లబ్ లో మైసురారెడ్డి మంగళవారంనాడు అస్తిత్వం, ఇదీ సంగతి అనే రెండు గ్రంథాలను ఆవిష్కరించారు. ఈ రెండు పుస్తకాలు కూడా రాయలసీమ ఉద్యమంపై రాసినవి కావడం విశేషం. రాయలసీమ రాజకీయాల ప్రస్తావన, ప్రజా సమస్యల ప్రస్తావన ఆ పుస్తకాల్లో ఉంది.  

దశాబ్దాలుగా రాయలసీమ ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కుంటున్నారని, గత ఐదేళ్లుగా తాను రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నానని, ఈ కాలంలో తాను రాయలసీమ సమస్యలపై పరిశోధన చేస్తూ పత్రికలకు వ్యాసాలు రాస్తూ వస్తున్నానని ఆయన చెప్పారు. తనకు వచ్చిన సలహా మేరకు ఈ రెండు పుస్తకాలు రాసినట్లు ఆయన తెలిపారు. 

రాయలసీమలో ఆ పుస్తకాలను ఆవిష్కరించినప్పుడు రాయలసీమ అభివృద్ధి కోసం ఏం చేశారని యువత ప్రశ్నించిందని, యువత తీవ్రమైన నిరాశానిస్పృహల్లో కొట్టుమిట్టాడుతోందనేది వాస్తవమని, కొత్త ఉద్యమం త్వరలోనే ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించిందని ఆయన అన్నారు. రాయలసీమ ప్రత్యేక సమస్యల పరిష్కారంపై శ్రద్ద చూపలేదని అన్నారు. 

అభివృద్ధి జలవనరులపై ఆధారపడి ఉంటుందని, రాయలసీమ నుంచి నదులు పారుతున్నా వాటిని వినియోగించుకోలేకపోతున్నామని ఆయన అన్నారు. కొత్త ప్రాంతీయ పార్టీలు పుట్టక ముందే ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆయన అన్నారు. 

తెలంగాణ ఉద్యమ కాలంలో నెల్లూరును కలుపుతూ గ్రేటర్ రాయలసీమ కోసం డిమాండ్ వచ్చిందని ఆయన గుర్తు చేశారు. మరో రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమం తలెత్తడం ఖాయమని రాయలసీమ నేత భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి అన్నారు. 

సంబంధిత వార్త

రాయలసీమ: మైసురా రెడ్డి సంచలన వ్యాఖ్యలు