ఏలూరు: వింత వ్యాధి బాధితులకు సంబంధించిన నమూనాల పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాతే అసలు కారణాలు తేలే అవకాశం ఉందని ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని చెప్పారు.

also read:ఏలూరులో వింత వ్యాధి: సీఎం జగన్ ఆరా, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్

మంగళవారం నాడు ఏలూరులోని బాధిత నివాస ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ ప్రాంతంలోని నీటి సరఫరా చేసే ఓవర్ హెడ్ ట్యాంకులు, డిస్ట్రిబ్యూషన్ పైప్‌లైన్లను ఆయన పరిశీలించారు.

ప్రస్తుతం 120 మంది బాధితులు చికిత్స పొందుతున్నట్టుగా ఆయన చెప్పారు. ప్రాథమిక నివేదికలో  బాధితుల శరీరాల్లో సీసం ఉన్నట్టుగా తేలిందన్నారు. బాధితుల నుండి తీసుకొన్న నమూనాలకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాతే ఈ వింత వ్యాధికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. 

ప్రజలు ఎవరూ కూడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.నగరంలో శానిటేషన్ డ్రైవ్ చేపట్టారు. నిత్యం జరిగే పారిశుద్య కార్యక్రమాలకు తోడుగా వచ్చే నాలుగు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.