ఏలూరు: పట్టణంలో వింతవ్యాధికి గురైన ప్రాంతాల్లో డబ్ల్యుహెచ్ఓ నిపుణుల బృందం పరీక్షలు నిర్వహిస్తోంది.

గత శనివారం నుండి వింత వ్యాధితో ప్రజలు ఏలూరులో ఇబ్బంది పడుతున్నారు. వింతవ్యాధికిగల కారణాలపై కేంద్ర, రాష్ట్ర సంస్థలతో పాటు డబ్ల్యు హెచ్ఓ, సీసీఎంబీ సంస్థల ప్రతినిధులు కూడ సర్వే నిర్వహిస్తున్నారు.

ఏలూరు వింత వ్యాధి బాధితుల నుండి తీసుకొన్న నమూనాలు సీసీఎంబీకి చేరుకొన్నాయి. వింత వ్యాధికి గల కారణాలను తేల్చేందుకు గాను సీసీఎంబీ బృందం పరిశోధనలు చేస్తోంది. ఈ పరిశోధనల ఫలితాలు రావాలంటే సమయం పట్టే అవకాశం ఉందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా చెప్పారు.

బాధితులు తీసుకొన్న ఆహారం, నీటి వివరాలను డబ్ల్యుహెచ్ఓ ప్రతినిధులు తెలుసుకొన్నారు. త్వరలోనే సర్వే పూర్తి చేస్తామని నిపుణులు ప్రకటించారు. కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా వినియోగించిన బ్లీచింగ్, క్లోరిన్ కూడ ఈ రకమైన వ్యాధికి కారణమైందా అనే కోణంలో కూడ డబ్ల్యుహెచ్ఓ నిపుణులు పరిశోధనలు చేయనున్నారు.

వింత వ్యాధి బాధితుల సంఖ్య నిన్నటితో పోలిస్తే ఇవాళ తగ్గిందని వైద్యులు తెలిపారు.