హైదరాబాద్: గ్రేటర్ రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఎజెండాను మాజీ మంత్రి ఎంవీ మైసురా రెడ్డి మరోమారు ముందుకు తెచ్చారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంపురం, కడప, కర్నూలు జిల్లాలను కలిపి గ్రేటర్ రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిందేనని ఆయన అన్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మీద ఆయన విమర్శలు చేశారు. 

కోస్తా, ఆంధ్రలతో కలిసి రాయలసీమవాసులు మనుగడ సాగించలేరని ఆయన అభిప్రాయపడ్డారు. సొంత ప్రాంతానికి వైఎస్ జగన్, చంద్రబాబు అన్యాయం చేశారని ఆయన విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన పూర్తిస్థాయి అంగీకారంతో జరగలేదని ఆయన అన్నారు.

తెలంగాణను స్ఫూర్తిగా తీసుకుని గ్రేటర్ రాయలసీమ ఉద్యమం చేపట్టాలని ఆయన అన్నారు. బిజెపి నేత, మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి రాసిన జై గ్రేటర్ రాయలసీమ పుస్తకాన్ని మైసురారెడ్డి శుక్రవారం హైదరాబాదులో ఆవిష్కరించారు. గ్రేటర్ రాయలసీమ ఉద్యమం ఆగిపోలేదని ఆయన అన్నారు. రాయలసీమ ఉద్యమ ఫలితంగానే హంద్రీనివా, గాలేరు నగరి వంటి ప్రాజెక్టులు వచ్చాయని ఆయన చెప్పారు. 

తెలంగాణ ఉద్యమమే తమకు స్ఫూర్తి అని గంగుల ప్రతాప్ రెడ్డి అన్నారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలను కలిపి గ్రేటర్ రాయలసీమను ఏర్పాటు చేయాలని ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ దినేష్ రెడ్డి అన్నారు.