Asianet News TeluguAsianet News Telugu

ఎడతెగని వివాదాలు: ఎవరీ చిగురుపాటి జయరాం..?

ఔషధ రంగంలో మంచి పట్టున్న జయరామ్ 90వ దశకంలో అమెరికా వెళ్లారు. ఉన్నత విద్య తర్వాత ర్యాన్ బాక్సీ కంపెనీలో భాగస్వామిగా ఉన్నారు. అక్కడ నుంచి మెుదలైన ఆయన ప్రస్థానం అంచలంచెలుగా ఎదిగారు. అయితే పారిశ్రామికంగా ఉన్నత స్థానాలను అధిరోహించిన ఆయన నిత్యం వివాదాల్లోనే ఉండేవారు.
 

Murdered in AP: who is Chigurupati Jayaram
Author
Vijayawada, First Published Feb 2, 2019, 5:30 PM IST

హైదరాబాద్:  తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎన్ఆర్ఐ, కోస్టల్ బ్యాంక్ ఎండీ, ఎక్స్ ప్రెస్ టీవీ చైర్మన్ చిగురుపాటి జయరామ్ చౌదరి హత్య ఇప్పుటు హాట్ టాపిక్ గా మారింది. చిగురుపాటి జయరామ్ చౌదరి ప్రస్తానంపై అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. 

అయితే జయరామ్ సన్నిహితులు మాత్రం అతని ప్రస్థానంపై చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. విజయవాడలో సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగిన ఆయన అమెరికాలో కోస్టల్ కారిడార్ బ్యాంక్ ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగిన వ్యక్తిగా చెప్పుకొస్తున్నారు. 

ఔషధ రంగంలో మంచి పట్టున్న జయరామ్ 90వ దశకంలో అమెరికా వెళ్లారు. ఉన్నత విద్య తర్వాత ర్యాన్ బాక్సీ కంపెనీలో భాగస్వామిగా ఉన్నారు. అక్కడ నుంచి మెుదలైన ఆయన ప్రస్థానం అంచలంచెలుగా ఎదిగారు. అయితే పారిశ్రామికంగా ఉన్నత స్థానాలను అధిరోహించిన ఆయన నిత్యం వివాదాల్లోనే ఉండేవారు.

పేటెంట్ల విషయంలో గొడవలు, భాగస్వాములతో విభేదాలు, ఉద్యోగులతో వివాదాలు ఆయన్ను చుట్టిముట్టేవి. విజయవాడ కానూరుకు చెందిన జయరాం తండ్రి కృష్ణమూర్తి మత్స్య శాఖలో ఏడిగా పనిచేశారు. విజయవాడ చుట్టుపక్కల ఆక్వా కల్చర్ పరిశ్రమ అభివృద్ధికి ఆయన సహకారమే అని ఇప్పటికీ చెప్పుకొంటారు. 

విజయవాడకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు దగ్గరి బంధువు చిగురుపాటి జయరాం. కృష్ణమూర్తికి ముగ్గురు సంతానం. జయరాం, చెల్లెళ్లు శశికళ, రెండో చెల్లి సుశీల. విజయవాడ మొగల్ రాజపురం రెవిన్యూ కాలనీకు చెందిన పద్మశ్రీతో జయరాంకు వివాహం జరిగింది. 

వివాహం అనంతరం భార్యతో కలిసి అమెరికాలో స్థిరపడ్డ జయరాం ఫార్మా రంగంలో తిరుగులేని పట్టు సాధించారు. అయితే చాలా కాలం వరకు ఆయనకు పిల్లలు పుట్టలేదు. కాన్సర్ చికిత్సలో వాడే ఔషధాలు, సంతాన లేమికి వాడే ఔషధాలు, డియాలిసిస్ లో అవసరమయ్యే థెరపటిక్స్ వంటి పలు ఔషధ రంగంలో వినియోగించే చాలా మందులకు పేటెంట్లు ఉన్నాయి. 

దేశంలో ప్రముఖ ఔషధ కంపెనీతో తలెత్తిన వివాదం ఆయన జీవితాన్ని మార్చేసిందని చెప్తారు. ఓ ప్రముఖ కంపెనీలో పార్టనర్ గా ఉన్న క్రమంలో విభేదాలు తలెత్తాయి. ఆ వివాదం కోర్టు మెట్లెక్కింది. ఆ కేసు జయరాంకు అనుకూలంగా తీర్పు రావడంతో వందల కోట్లు పారితోషకం లభించింది. 

అప్పటి నుంచి ఆయనకు ఎదురేలేకుండా పోయింది. జయరాం ఇద్దరు చెల్లెళ్ల లో పెద్ద చెల్లి శశికళ  గుడ్లవల్లేరుకు చెందిన వెంకటాద్రితో వివాహం జరిగింది. ఆమెకు ముగ్గురు పిల్లలు. ఆ ముగ్గురు కూడా జయరాం కంపెనీల్లో కీలక స్థానాల్లో ఉన్నారు. 

ఇక రెండో చెల్లెలు సుశీలకు ఇద్దరు కుమార్తెలు. సుశీల భర్తతో విబేధాలు కారణంగా ఆమె భర్తకు దూరంగా ఉండటంతో వారి బాగోగులు జయరాం చూసేవారు. విజయవాడ కానూరులో ఉన్న జయరాం తల్లిదండ్రులతో పాటు ఆమె పిల్లలతో కలిసి ఉండేది. రెండేళ్ల వ్యవధిలోనే జయరాం తల్లిదండ్రులు చనిపోయారు. 


మరోవైపు వ్యాపార రంగాల్లో ఉన్నత స్థానాలకు ఎదిగిన జయరాం పిల్లలు లేకపోవడంతో భార్య పద్మశ్రీ చెల్లెలి కుమార్తెను దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్న రెండేళ్ల తర్వాత జయరాంకు ఒక కుమారుడు పుట్టాడు. 2013వరకు ఈ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవు. 

2003 నుంచి ఆయన భారత్ లో ఔషధ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు.హేమారస్ థెరపటిక్స్ 2003 లో స్థాపించిన తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. బయాలజీ, పాలిస్టర్స్, ఫార్మా రీసెర్చ్,  ప్లాంట్ సైన్సెస్ ఇన్ఫ్రా, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, ఐటీ ఇలా అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. పారిశ్రామికంగా ఎదుగుతున్నా ఆయన్ను మాత్రం వివాదాలు వదల్లేదు. 

కాలంతోపాటు వివాదాలు కూడా పెరుగుతూనే వచ్చాయి. 2012 తర్వాత ఆయన సొంత జిల్లాలో అడుగుపెట్టారు. అప్పటి వరకు పారిశ్రామిక వర్గాల్లో తప్ప పెద్దగా ఎవరికి తెలియని ఆయన విజయవాడ కు చెందిన కోస్టల్ బ్యాంక్ టేక్ ఓవర్ సందర్భంగా ఆయన పేరు మార్మోగిపోయింది. 

ఆ తర్వాత బ్యాంక్ వ్యవస్థాపకులతో తలెత్తిన వివాదం చర్చకు దారి తీసింది. చివరికి కేంద్ర రెవిన్యూ సర్వీస్ లో కీలక స్థానంలో ఉన్న వ్యక్తి మధ్యవర్తిత్వం వ్యవహరించడంతో సమస్య కాస్త సద్దుమణగింది. అటు ఫార్మా పేటెంట్ ల విషయంలో కూడా జయరాం నిర్మోహమాటంగా వ్యవహరిస్తారని ప్రచారం.  

చాలా మంది ఇండస్ట్రీ పెద్దలతో పేటెంట్ వివాదాలతో వేధించేవారని చెప్పుకుంటారు. 


నష్టాల్లో ఉన్న పరిశ్రమలను వదిలించుకోవటంలో జయరాం సిద్ధహస్తుడని ప్రచారం. హైదరాబాద్ లో ప్రముఖ కళ్ళజోళ్ల కంపెనీ టెక్ట్రాన్ పరిశ్రమ మూసి వేయడంతో  ఉద్యోగులు రోడ్డున పడ్డారు. వాళ్ళు కోర్టుకు వెళ్లడంతో ఏడాది క్రితం జైలుకు వెళ్లాల్సి వచ్చింది.  

2013లో జేఎస్డీ డేటా మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఎక్స్ ప్రెస్ టీవీని ప్రారంభించారు జయరాం. అందులో జయరాం, భార్య పద్మశ్రీ లు భాగస్వామ్యంగా ఉన్నారు. వీరితోపాటు పంజాబ్ కు చెందిన ఎక్స్ ప్రెస్ టీవీ రిజిస్టర్ ఓనర్లు డైరెక్టర్లుగా వ్యవహరించారు. 

అనూహ్యంగా 2015లో ఆయన మేన కోడలు పులివర్తి మాధురి అలియాస్ శిఖాచౌదరి ఛానెల్ వైస్ ప్రెసిడెంట్ గా అడుగుపెట్టారు. మరో మేనకోడలు మనీషా ఫార్మా కంపెనీలలో డైరెక్టర్ అయ్యారు. ఆ తర్వాత కాలంలో ఇద్దర్నీ జయరాంకు ఉన్న అన్ని కంపెనీలలో డైరెక్టర్లుగా మేనకోడళ్లను నియమించారు. 

మేనకోడళ్లను పెద్దపదవుల్లో కూర్చోబెట్టడంతో కుటుంబంలో కలతలు చెలరేగాయి. భార్య పద్మశ్రీ వారి జోక్యాన్ని సహించలేకపోయారు. దీంతో న్యూస్ ఛానెల్ కు సంబంధించి ఫండింగ్ ను నిలిపివేశారు పద్మశ్రీ.  దీంతో ఆ ఛానల్ మూతపడింది.  

2016లో ఛానెల్ ఒడిదుడుకుల్లో ఉన్న సమయంలో చిన్న మేనకోడలు మనీషాకి రూ.2కోట్లు డొనేషన్ చెల్లించి ఏలూరు మెడికల్ కాలేజీలో ఎండి మెడిసిన్ సీట్ కొనుగోలు చేశారు. అదే సమయంలో శిఖాచౌదరికి ఖరీదైన బిఎండబ్ల్యూ కార్ కొనిచ్చారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో ఎక్స్ ప్రెస్ టీవీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లేబర్ కోర్టును ఆశ్రయించారు.  

విషయం కోర్టుల వరకు వెళ్లడంతో ఆయన అమెరికా వెళ్లిపోయారు. నెలరోజుల క్రితం అమెరికా నుంచి వచ్చారు. గత నెల 21న జరిగిన కోస్టల్ బ్యాంక్ బోర్డ్ మీటింగ్ లో పాల్గొన్నారు.  బ్యాంక్ ఎండిని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఎండికి బాధ్యతలు అప్పగించి ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయారు. 

విజయవాడ ఎప్పుడు వచ్చినా గేట్ వే హోటల్ 7వ అంతస్తులో కార్నర్ రూమ్ లో బస చేసేవారు జయరాం. జనవరి 31 సాయంత్రం కూడా అలాగే  కోస్టల్ బ్యాంక్ జీఎం కు ఫోన్ చేసి హోటల్ లో రూం బుక్ చెయ్యమని ఆదేశించారు. విజయవాడ రాకుండానే కానరాని లోకాలకు వెళ్లిపోయారు జయరాం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios