సహజీవనం చేస్తున్న మహిళను అనుమానంతో అంతమొందించాడో వ్యక్తి. ఆమె తల్లిని కూడా చంపేశాడు. ఆ తరువాత ఆమె కూతురి మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతనికి చిత్తూరు కోర్టు జీవితాంతం జైలుశిక్ష విధించింది.
చిత్తూరు : ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరులో ఓ కామాంధుడు తల్లీ, కూతుర్లను హతమార్చాడు. ఓ బాలిక మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ కేసు రుజువడంతో.. సోమవారం సదరు వ్యక్తికి చిత్తూరులోని ప్రత్యేక మహిళా కోర్టు మరణించేంత వరకు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసుకు సంబంధించి అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శైలజ ఈ మేరకు వివరాలను తెలియజేశారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలంలోని గంగిరెడ్డి కాలనీకి చెందిన సయ్యద్ మౌలాలి (47)కి ఈ శిక్ష పడింది. అతను చేపల చెరువులను లీజుకు తీసుకుని.. చేపలు పట్టి అమ్మే వ్యాపారం చేస్తుంటాడు.
అదే మండలంలోని ఓ గిరిజన తండాకు చెందిన 37 ఏళ్ల సరళమ్మ భర్త మరణించాడు. ఈ క్రమంలో మౌలాలికి ఆమెతో పరిచయమైంది. దీంతో కొన్నేళ్ల పాటు వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తల్లి కూడా ఆమెతో పాటే ఉంటుంది. ఈ క్రమంలో మౌలాలి సరళమ్మ మీద అనుమానం పెంచుకున్నాడు. ఆమె వేరే మగవాళ్ళతో ఫోన్లో మాట్లాడుతుందని పొలం వద్ద రాత్రిపూట గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. దీంతో అక్కడే ఉన్న కర్రతో ఆమె తల మీద గట్టిగా కొట్టాడు.
ఈ దెబ్బలతో ఆమె చనిపోవడంతో ఆమె మృతదేహాన్నిపెద్దేరు ప్రాజెక్టులో పడేశాడు. మృతదేహం పైకితేలి తాను దొరికిపోకుండా ఉండాలని.. ఆమె చీరకు రాళ్లు కట్టి పడేశాడు. అయితే, వీరి సంబంధం గురించి తెలిసిన సరళమ్మ తల్లి గంగులమ్మ కూతురు కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్లిందని మౌలాలిని నిలదీసింది. దీంతో మౌలాలి తెల్లారేసరికి ఆమె వస్తుందని గంగులమ్మకి చెప్పి నమ్మించాడు. ఆ తర్వాత ఆమెకు మద్యం తాగే అలవాటుండడంతో.. మద్యం తెచ్చి తాగించాడు. నిద్రపోయిన తర్వాత ఆమె చీర కొంగుతో గొంతును బిగించి చంపేశాడు.
ఆ తర్వాత సరళమ్మ తల్లి గంగులమ్మ శవాన్ని కూడా ఓ చెరువులోకి తీసుకెళ్లి పడేశాడు. ఆమె చీరను నీటిలోని ఓ చెట్టు మొదలుకు కట్టేసి శవం పైకి తేలకుండా చేశాడు. ఇవేమీ తెలియని సరళమ్మ కూతుర్లు.. తెల్లవారిన తర్వాత.. అమ్మ, అమ్మమ్మ ఎక్కడున్నారని మౌలాలిని నిలదీశారు. అయితే, మౌలాలి వారితో అబద్ధం చెప్పాడు. వారి అమ్మ, అమ్మమ్మలకు కరోనా వచ్చిందని... అందుకని ఆసుపత్రిలో చేర్పించానని తెలిపాడు. అది వారు నమ్మారు. ఈ క్రమంలో వారితో పాటే ఇంట్లో ఉండడం.. ఇంట్లోనే పడుకోవడం చేసేవాడు.
ఈ సమయంలో ఒకరోజు పెద్దమ్మాయి మీద లైంగిక దాడి చేశాడు. ఆ తరువాత ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని ఆమెను బెదిరించాడు. నెల రోజులపాటు ఈ అఘాయిత్యాన్ని అలాగే కొనసాగించాడు. ఆ తరువాత వారిని అక్కడ నుంచి తరలించి కర్ణాటకలోని గౌనిపల్లెలోని ఓ ఇంట్లో ఉంచాడు. ఓవైపు ఇలా జరుగుతుంటే మరోవైపు.. సరళమ్మ, ఆమె తల్లి గంగులమ్మ, ఆమె ముగ్గురు కుమార్తెలు కనిపించకుండా పోవడంతో.. బంధువులకు అనుమానం వచ్చింది.
వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి సయ్యద్ మౌలాలిని విచారించారు. ఆ తర్వాత అతనిని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో సయ్యద్ చేసిన ఆకృత్యాలు వెలుగు చూడడంతో.. బాలికలను అతడి నుంచి విడిపించారు. ఆ తర్వాత కనిపించకుండా చెరువులో పడేసిన తల్లి, కూతుర్ల మృతదేహాలను అతడు చెప్పిన వివరాల మేరకు బయటకు తీశారు. ఈ క్రమంలోనే అతని మీద అత్యాచారం, అట్రాసిటీ, పలు హత్యలు, కిడ్నాప్ కేసులు నమోదు చేశారు.
ఈ కేసులో.. నిందితుడి మీద మోపిన అభియోగాలు న్యాయస్థానంలో రుజువయ్యాయి. దీంతో న్యాయమూర్తి నిందితుడిని దోషిగా తేలుస్తూ.. మరణించేంతవరకు జైలులో ఉండాలని శిక్ష విధించారు. దీంతోపాటు రూ. పదివేల జరిమానా విధిస్తూ సోమవారం తీర్పునిచ్చారు. లైంగిక దాడికి గురైన బాధిత బాలికకు రూ.5 లక్షల పరిహారం మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్కు సూచిస్తూ తీర్పు ఇచ్చారు.
