ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టార్గెట్‌గా ప్రముఖ బాలీవుడ్ సింగర్ అద్నాన్ సమీ మరోసారి సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే అద్నాన్ సమీపై వైసీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టార్గెట్‌గా ప్రముఖ బాలీవుడ్ సింగర్ అద్నాన్ సమీ మరోసారి సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. ఇందుకు మరోసారి ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు ప్రతిష్టాత్మక అవార్డు దక్కడమే కేంద్ర బిందువుగా మారింది. ఈ ఏడాది జనవరిలో ‘నాటు నాటు...’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగరీలో ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కింది. ఆ సమయంలో కూడా ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌ను అభినందిస్తూ సీఎం జగన్ ట్వీట్‌పై అద్నాన్ సమీ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అందుకు వైసీపీ శ్రేణులు అదే స్థాయిలో అద్నాన్ సమీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజాగా ‘‘నాటు నాటు..’’ పాటను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ వరించిన వేళ ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌ను అభినందిస్తూ సీఎం జగన్ చేసిన ట్వీట్‌పై అద్నాన్ సమీ విమర్శలు గుప్పించారు. తెలుగు జెండా రెపరెపలాడుతోంది అని జగన్ ట్వీట్ చేయడంపై అద్నాన్ సమీ అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ను ‘‘ఒక చెరువులో ప్రాంతీయ భావాలు కలిగిన కప్ప’’ అని విమర్శించారు.
‘‘తెలుగు జెండా రెపరెపలాడుతోంది! మన జానపద వారసత్వాన్ని ఎంతో అందంగా జరుపుకునే తెలుగు పాట పట్ల నేను గర్వపడుతున్నాను. ఈ రోజు అంతర్జాతీయంగా దానికి తగిన గుర్తింపు లభిస్తోంది. రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, ఎంఎం కీరవాణి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్, కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్.. మొత్తం ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందానికి అభినందనలు. నన్ను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నన్ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది తెలుగు ప్రజలను, భారతీయులందరినీ గర్వపడేలా చేసినందుకు ధన్యవాదాలు’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
దీనిపై స్పందించిన అద్నాన్ సమీ.. ‘‘సముద్రం గురించి ఆలోచించలేని చెరువులో ప్రాంతీయ మనస్తత్వం ఉన్న కప్ప.. ఎందుకంటే అది అతని చిన్న ముక్కుకు మించినది!!’’ అని విమర్శించారు. ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతున్నాడని ఆరోపించారు. జాతీయ గర్వం గురించి ఆయనకు బోధించడం సాధ్యం కాదంటూ మండిపడ్డారు.
వైసీపీ మద్దతుదారుల నుంచి కౌంటర్..
అద్నాన్ సమీ చేసిన ట్వీట్‌పై పలవురు వైసీపీ మద్దతుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్ల ప్రశ్నలకు అద్నాన్ సమీ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘‘దక్షిణాదివారు హిందీ నేర్చుకున్నట్టుగా.. ఉత్తర భారతీయులు దక్షిణ భాషలను ఎందుకు నేర్చుకోరు’’ అని ఓ నెటిజన్ చేసిన కామెంట్‌పై స్పందిస్తూ.. ‘‘ప్రతి భాష విలువైనది. అన్ని ప్రేమ, గౌరవాలకు అర్హమైనది. అయితే.. మీరు ఈ హాస్యాస్పదమైన చెత్తను ఆపండి. మెజారిటీ వాస్తవికతను అంగీకరించాలి’’ అని సమీ పేర్కొన్నారు.
సమస్య భాష గురించి కాదంటూ సమీ వివరణ..
సీఎం జగన్ ట్వీట్‌పై అద్నాన్ చేసిన విమర్శలపై నెటిజన్లు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. తాను చేసిన కామెంట్స్‌కు ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘‘నా సమస్య ఎప్పుడూ భాష గురించి కాదు. నా సమస్య చాలా సరళమైనది... అన్ని భాషలు, వాటి మూలం, మాండలికంతో సంబంధం లేకుండా, అంతిమంగా భారతదేశం అనే ఒకే గొడుగు కింద ఉన్నాయి. ఆ తర్వాతే మరేదైనా.. అంతే. ! నేను అదే కృషితో, అందరికీ సమాన గౌరవంతో ప్రాంతీయ భాషలలో అసంఖ్యాకమైన పాటలు పాడాను..’’ అని సమీ ట్వీట్ చేశారు. అయితే నెటిజన్లు మాత్రం అద్నాన్ సమీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అద్నాన్ సమీ 2016లో భారతీయ పౌరసత్వం పొందారని గుర్తు చేస్తున్నారు.
