కాబోయే భర్త గొంతు కోసిన యువతి కేసులో.. ఆమె అతనితోపాటే వెళ్లి.. అతని కళ్లముందే.. అతని గొంతుకోసే కత్తి కొనిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఏం కొన్నావని రామునాయుడు అడిగితే గిఫ్ట్ అంటూ చెప్పుకొచ్చిందని పోలీసులు తెలిపారు.
అనకాపల్లి : పెళ్లి చేసుకోవడం ఇష్టంలేక కాబోయే భర్త గొంతు కోసినట్లు యువతి వియ్యపు pushpa అంగీకరించిందని అనకాపల్లి డిఎస్ పి బి సునీల్ వెల్లడించారు. మంగళవారం anakapalli జిల్లా మాడుగుల మండలం ఘాట్ రోడ్ జంక్షన్ కు చెందిన అద్దేపల్లి రామునాయుడికి రావికమతం గ్రామానికి చెందిన పుష్ప 22తో మే 20న వివాహం జరగాల్సి ఉంది. అత్తమామల ఆహ్వానం మేరకు రామానాయుడు సోమవారం రావికమతం లో వాళ్ళ ఇంటికి వెళ్లారు. స్నేహితులకు పరిచయం చేస్తానని ఇద్దరం కాసేపు బయట తిరిగి వద్దామని పుష్ప చెప్పడంతో ఇద్దరూ కలిసి స్కూటీపై బయలుదేరారు.
వడ్డాది వద్ద ఫాన్సీ దుకాణం దగ్గర వాహనం ఆపించి, కత్తి కొనుగోలు చేసింది. అది రామానాయుడికి చూపించలేదు. ఏమి కొంటున్నావు అని రాము అడగగా.. ‘బహుమతి’ అని బదులిచ్చింది. ఆ తర్వాత ఇద్దరు కోమళ్లపూడి శివారులోని అమరపురి ఆశ్రమం వద్ద గడిపారు. స్నేహితులు ఏరి అని రాము ప్రశ్నించగా కేక్ తీసుకురావడానికి వెళ్లారని, ఈలోగా నీకు ‘సర్ ప్రైజ్ గిఫ్ట్’ ఇస్తానని చెప్పింది. అలా చెబుతూనే తన చున్నీతో కళ్ళకు గంతలు కట్టింది. వెంటనే కత్తితో గొంతుపై కత్తితో గట్టిగా కోసింది.
రాము బలవంతంగా చున్ని తీసేసుకోగా తనకు ఈ పెళ్లి ఇష్టంలేక ఇలా చేసినట్లు పుష్ప విలపించింది. ఆమె కూడా ఏమైనా చేసుకుంటుందన్న భయంతో రామానాయుడు స్వయంగా పుష్పను స్కూటీపై ఎక్కించుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో కొంత దూరం వచ్చాక స్పృహ తప్పి పడిపోతుండగా ఎదురుగా వస్తున్న ఇద్దరు వ్యక్తులు చూసి వారిని రావికమతం పీహెచ్సీకి తీసుకెళ్లారు. యువకుడికి అక్కడ ప్రథమ చికిత్స చేసి తరువాత అనకాపల్లికి తరలించారు.
కేంద్ర కారాగారానికి…
ఈ ఘటన తర్వాత రావికమతంలో ఉన్న పుష్పను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఘటనా స్థలానికి వెళ్లి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఆమెపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. మంగళవారం రాత్రి చోడవరం జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఉమాదేవి ఎదుట హాజరుపరిచారు. కోర్టు ఆదేశాలతో జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం విశాఖ కేంద్రకారాగారానికి తరలించారు.
ఇదిలా ఉండగా, పుష్ప భక్తి మైకంలో వుండిపోయిన ఆమె.. తనకు పెళ్లి వద్దని, తాను దేవుడి భక్తురాలిగానే వుండిపోతానని తల్లిదండ్రులకు చాలా సార్లు చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే రెండు పెళ్లి చూపులు రద్దు కావడంతో మూడోసారి పుష్పను తల్లిదండ్రులు ఎలాగో ఒప్పించారు. ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక పుష్ప డిప్రెషన్‌లోకి వెళ్లింది. దీంతోనే కాబోయే భర్తను బయటకు తీసుకెళ్లి చంపాలని ప్లాన్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. గుడి దగ్గర రామునాయుడు కళ్లకు చున్నీ కట్టి... గొంతు కోసినట్లు పోలీసు విచారణలో అంగీకరించింది పుష్ప.
అంతకుముందు రామూనాయుడిపైనే పుష్ప తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. బయటకు వెళ్లాలని తమ కూతురును తీసుకెళ్లేందుకు రాము నాయుడు తమ అనుమతి అడిగారన్నారు. అయితే మధ్యాహ్నం సమయం కావడంతో వద్దని తమ కూతురు చెప్పిందన్నారు. బర్త్‌డే గిఫ్ట్ ఇప్పిస్తానని తీసుకెళ్లాడని పుష్ప తల్లి చెప్పింది. అయితే గిఫ్ట్ కొనే పేరుతో చాలా దూరం తీసుకెళ్లాడన్నారు. అయితే తాను తమ కూతురికి ఫోన్ చేయడంతో ఇంటికి వస్తామని చెప్పిందన్నారు.
