విశాఖపట్నం: సచివాలయ ఉద్యోగిణిపై ఓ ప్రేమోన్మాది కత్తితో దాడిచేసిన దారుణం విశాఖ నగరంలో చోటుచేసుకుంది. ఫెర్రీ వీధిలో నివాసముంటున్న ప్రియాంకపై యువకుడు కత్తితో దాడి చేయడమే కాదు అదే కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం వీరిద్దరూ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. 

సచివాలయ ఉద్యోగిగా పనిచేస్తున్న ప్రియాంక వేరే యువకుడితో స్నేహంగా వుండటాన్ని శ్రీకాంత్ అనే యువకుడు తట్టుకోలేకపోయాడు. దీంతో ఆమెపై కోపాన్ని పెంచుకున్న అతడు ఇవాళ దారుణానికి ఒడిగట్టాడు. ఒంటరిగా వెళుతున్న ప్రియాంకను అడ్డగించి వెంటతెచ్చుకున్న కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో ప్రియాంక రక్తపు మడుగులో అక్కడే పడిపోయింది. 

అక్కడినుండి నేరుగా ప్రియాంక ఇంటికి చేరుకున్న శ్రీకాంత్ ఆమె తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలిపాడు. అలా వారితో మాట్లాడుతూ ఒక్కసారిగా కత్తితో తనను తాను గాయపర్చుకుని ఆత్మహత్యాయత్రానికి పాల్పడ్డాడు. 

వెంటనే స్థానికులు అతడిని హాస్పిటల్ కు తరలించారు. అలాగే రక్తపు మడుగులో కొన ఊపిరితో పడివున్న ప్రియాంకను తల్లిదండ్రులు హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం వీరిద్దరి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.