ఇద్దరు మున్సిపల్ ఛైర్మన్లకు గాయాలు


ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన చేపట్టిన మహానాడు కార్యక్రమానికి వెళ్తూ ఇద్దరు మున్సిపల్ ఛైర్మన్లు గాయాలపాలయ్యారు. మహానాడుకు బయలుదేరిన బాపట్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కారు అదుపుతప్పి మదనపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ గాయపడ్డారు. బాపట్ల చైర్‌పర్సన్‌ భర్త నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలో బైపాస్‌ రోడ్డుపై ఎస్‌బీఐ బ్యాంకు ఎదురుగా ఆదివారం ఈ ప్రమాదం జరిగింది.

బాపట్ల చైర్‌పర్సన్‌ తోట మహాలక్ష్మి తన భర్త నారాయణతో కలసి విజయవాడలో జరిగే మహానాడుకు వెళ్తుండగా ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి ముందు టైరు పగిలిపోయింది. దీంతో కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న మదనపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ కె.శివప్రసాద్‌ కారును ఢీ కొట్టింది. ప్రస్తుతం వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.