బిసి సోదరులకు హాని చేసే రిజర్వేషన్లు కాపులు కోరుకోవడం లేదు
కాపులు కోరుతున్న బిసి హోదా , రిజర్వేషన్ల డిమాండ్ మీద వెనకబడిన వర్గాలలో ఉన్న అపోహలను తొలగించేందుకు తాను వూరూర తిరుగుతున్నానని కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ ప్రకటించారు. ఇందులో భాగంగా బిసి సంక్షేమ సంఘం నాయకుడు కేశన శంకరరావుతో ఆయన అదివారం నాడు సమావేశమయ్యారు.

దీనికోసం ముద్రగడ గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం బొర్రవారిపాలెం వచ్చారు. బిసిలకు హాని చేసే రిజర్వేషన్ లు కాపులు కోరడం లేదనే విషయాన్ని బిసి వర్గాలు గుర్తించాలని స్పష్టం చేశారు.
ఈ మధ్య కాపు (బిసి ) కమిషన్ కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయంమీద ప్రజా భిప్రాయం సేకరిస్తున్నపుడు పలుచోట్ల బిసిలు గొడవ చేస్తున్న సంగతి తెలిసిందే. కాపులను బిసిలలో చేరిస్తే తమకు హాని జరుగుతుందనేది వారి ఆందోళన. ముద్రగడ బిసినేలతను కలుసుకునేందుకు రాష్ట్ర వ్యాపితంగా పర్యటించాలనుకుంటున్నది దీని వల్లే.
కాపులను బిసి జాబితాలో చేరుస్తామని ఎన్నికలప్పుడు మ్యానిఫెస్టోల్లో చేర్చి అధికారంలోకొచ్చాక తెలుగుదేశం పార్టీ విస్మరించడం అన్యాయమని ఈసందర్భంగా మాట్లాడుతూ అన్నారు.
‘సామాజిక న్యాయం కోసం మేం ఆందోళన చేస్తున్నాం, జనాభా ప్రాతిపదికన ఎవరికీ ఇబ్బందుల్లేని రిజర్వేషన్లను మేం కోరుతున్నాం,’ అని ఆయన అన్నారు.
కేశన శంకరరావు మాట్లాడుతూ సామాజిక తరగతులను వర్గీకరించాకే కాపులను బిసిల్లో చేర్చే ప్రతిపాదన ఆలోచించాలని, ముందుగానే చేరిస్తే వ్యతిరేకత వస్తుందని హెచ్చరించారు.
ఈ సంస్థ జాతీయ కార్యదర్శి ఆల్మండ్ రాజు మాట్లాడుతూ బిసిల్లో గతంలో ఉన్న 93 ఉపకులాలు ఇపుడు 130 కు పెరిగాయని, రిజర్వేషన్ శాతం మాత్రం 27 శాతంగానే ఉంచడం వల్ల బిసిలకు అన్యాయం జరుగుతూ ఉందని అన్నారు.
రాష్ట్రంలో జనాభా గణాంక లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని తాము కూడా కోరుతున్నామని ఆయన చెప్పారు.
