క్యాన్సర్ ఉందన్న కుమార్తె ఆరోపణలపై ముద్రగడ పద్మనాభరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆరోగ్యంగా ఉన్నానంటూ లేఖ ద్వారా వివరణ ఇచ్చారు.తన కుమారుడి రాజకీయ ఎదుగుదల ఓర్వలేకే ఈ తప్పుడు ప్రచారాలని ఆరోపించారు.
వైఎస్సార్సీపీ(YCP) సీనియర్ నేత ముద్రగడ పద్మనాభానికి క్యాన్సర్ వచ్చిందని ఆయన కుమార్తె క్రాంతి ఇటీవల ఆరోపణలు చేసిన విషయం రాజకీయంగా చర్చనీయాంశమైంది. తాజాగా ఈ ఆరోపణలపై ముద్రగడ స్వయంగా స్పందిస్తూ ఓ లేఖ విడుదల చేశారు. తనకు క్యాన్సర్ లేదని స్పష్టం చేస్తూ, వయోభారంతో కూడిన ఆరోగ్య సమస్యలు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు.
అసత్య ప్రచారం…
తన ఆరోగ్యంపై అసత్య ప్రచారం చేయడం తన కుమారుడు గిరిబాబు ఎదుగుదల చూసి ఓర్వలేక కొందరు చేస్తుండవచ్చని ముద్రగడ పేర్కొన్నారు. గతంలో తమ కుటుంబానికి ,మరో కుటుంబంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని, వారి కుట్రలే ఇవని ఆయన అన్నారు.
క్రాంతి చేసిన ఆరోపణలను ఖండించిన ముద్రగడ, తన చిన్న కొడుకు గిరిబాబు వల్లే తాను వైద్య సేవలు పొందుతూ ఆరోగ్యంగా ఉన్నానన్నారు. గతంలో తన భార్యకు క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా ఆరోపణలు చేసిన కుటుంబం తమను ఇంట్లోకి అనుమతించలేదని గుర్తు చేశారు.
చీప్ పబ్లిసిటీ కోసం…
తనను బంధించి ఉంచారని, వైద్యం చేయడం లేదన్న ఆరోపణలు అబద్ధం అని చెప్పారు. నిత్యం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని, అభిమానులతో కలుస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో కాపు రిజర్వేషన్ వంటి హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయాలని, అసత్య ఆరోపణలతో చీప్ పబ్లిసిటీ కోసం ప్రయత్నించవద్దని హితవు చెప్పారు.
తన కొడుకు, మనవాళ్లను కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలని సంకల్పించానని, ప్రజల మద్దతుతో వారిని ఎదుగుదల దిశగా నడిపిస్తానన్నారు. తప్పుడు ఆరోపణలు, రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన కుట్రలతో తాను బెదరనని స్పష్టం చేశారు.