జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ  పద్మనాభం లేఖ రాశారు. పార్టీకి అధినేతగా ఉన్న పవన్ వీధి రౌడి భాషలో మాట్లాడటం ఎంత వరకూ న్యాయమని ప్రశ్నించారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ప్రస్తుతం ఏపీలో పవన్ వారాహి యాత్ర కొనసాగిస్తూ.. జనసేన శ్రేణులను ఎన్నికలకు సిద్దం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికార వైసీపీ నేతలపై విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పవన్‌కు ముద్రగడ పద్మనాభం లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖతో పవన్‌కు కోపం రావచ్చని.. ఆయన కోట్లాది మంది అభిమానులకు అయితే నన్ను తుది ముట్టించాలనే ప్రయత్నం చేయవచ్చని కూడా పేర్కొన్నారు. నిజాన్ని నిర్భయంగా చెప్పాలనే తాను లేఖ రాస్తున్నట్టుగా చెప్పారు. 

చంద్రబాబు నాయుడు పోగొట్టుకున్న బీసీ రిజర్వేషన్ పునరుద్ధరిస్తానని పదే పదే చెప్పడం వల్ల రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి బాబు ద్వారా పవన్ కల్పించాని అన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్.. కాపు రిజర్వేషను అంశం తన చేతిలో ఉండదని కేంద్రం పరిధిలోనిది అని చెప్పినప్పుడు.. తాను ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసుకోవాలని పవన్‌కు సూచించారు. తాను కోట్లాది రూపాయలకు అమ్ముడుపోయి ఉద్యమం చేయలేదని.. తాను వదిలేసిన ఉద్యమాన్ని చేపట్టి యువతకు రిజర్వేషన్ ఫలాలు మీరు ఎందుకు అందించలేదో సమాధానం చెప్పాలని పవన్‌ను ప్రశ్నించారు.

ఎమ్మెల్యేను తిట్టడానికి మీ విలువైన సమయాన్ని వృధా చేయవద్దని.. ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్మకం నుంచి కాపాడటం, ప్రత్యేక రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంటు వగైరా సమస్యల గురించి మాట్లాడాలని కోరారు. 2019 ఎన్నికల ముందు పవన్ తన వద్దకు పంపించిన రాయబారులకు సలహా ఇచ్చి పంపించానని.. కానీ ఆ సలహాలు అడిగి గాలికి వదిలేసారని విమర్శించారు. నిజంగా రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఉంటే వాటిపై యుద్దం చేయాలని పవన్‌ను లేఖలో కోరారు.

పార్టీకి అధినేతగా ఉన్న పవన్ వీధి రౌడి భాషలో మాట్లాడటం ఎంత వరకూ న్యాయమని ప్రశ్నించారు. రాజకీయాలలో సామాన్యుడి ఇంటికి వెళ్లి ఓట్లు అడుక్కోవాలని అన్నారు. అయితే ఉద్యమం మంచి కోసం చేస్తే కులాలకు అతీతంగా బలపరిచేవారు చాలా మంది ఉంటారని అన్నారు. పవన్ భాష వల్ల నష్టం తప్ప లాభం ఎంత మాత్రం ఉండదని చెప్పారు. పవన్ కల్యాణ్.. ఇప్పటివరకు ఎంత మందిని చెప్పుతో కొట్టారో గుండ్లు గీయించారో సెలవు ఇవ్వాలి అంటూ ఎద్దేవా చేశారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి కుటుంబం తప్పుడు మార్గాల్లో సంపాదిస్తుంది అని మాట్లాడడం తప్పు అన్నారు. కాపుల ఉద్యమానికి సహాయం చేసిన వారిని విమర్శించడం తప్పన్నారు.

కాపులు చేసిన ఉద్యమాలకు పవన్‌ ఎందుకు రాలేదని తానేమీ ప్రశ్నించనని అన్నారు. అలాంటి పవన్‌ ఉపన్యాసాల్లో కాపులు పెద్దన్న పాత్ర పోషించాలనడం 
విడ్డూరంగా ఉందని చెప్పారు. కాకినాడ ఎమ్మెల్యే దొంగ అయితే రెండు దఫాలు ఎమ్మెల్యేగా ఎందుకు గెలుపొందారో ఆలోచించాలని లేఖలో పేర్కొన్నారు. దుర్మార్గపు శాసనసభ్యులను అసెంబ్లీకి పంపించకుండా ఉండడం కోసం రేపు జరగబోయే ఎన్నికలలో వారి మీద పోటీ చేసి చిత్తుగా ఓడించాలని డిమాండ్ చేశారు. బీజేపీ, టీడీపీలతో కలిసి పోటీ చేస్తామని పవన్ తరచూ చెబుతున్నారని.. అలాంటప్పుడు తనను ముఖ్యమంత్రిని చేయమని ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. 175 స్థానాలకు పోటీ చేసినప్పుడు ముఖ్యమంత్రిని చేయమని కోరాలన్నారు.