పవన్ కల్యాణ్ ను ఓడిస్తానంటూ ఛాలెంజ్ చేస్తున్న ముద్రగడ పద్మనాభంకు ఆయన కూతురే చీవాట్లు పెట్టింది. తన తండ్రిని కాదని పవన్ కు మద్దతుగా నిలిచారు ముద్రగడ ఇంటి ఆడపడుచు క్రాంతి.
కాపు నేత ముద్రగడ పద్మనాభంకు సొంత కూతురు షాకిచ్చింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను విమర్శిస్తున్న తండ్రికి సుతిమెత్తగా చీవాట్లు పెట్టింది కూతురు క్రాంతి. కేవలం పవన్ కల్యాణ్ ను తిట్టేందుకే తన తండ్రిని వైఎస్ జగన్ వాడుకుంటున్నారని... ఎన్నికలు ముగియగానే ఆయనను ఎటూ కాకుండా విడిచివెళ్లడం ఖాయమని అన్నారు. తన తండ్రి చేస్తున్న విమర్శలను తప్పుబట్టిన క్రాంతి పవన్ కల్యాణ్ కు తన పూర్తి మద్దతు వుంటుందన్నారు.
పద్మనాభం కూతురు ఏమన్నారంటే :
పిఠాపురం అసెంబ్లీలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ను ఓడించేందుకు వైసిపి నాయకులు అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి అన్నారు. ఇందుకోసం తన తండ్రిని కూడా వాడుకుంటున్నారని... ఆయనతో పవన్ కల్యాణ్ పై విమర్శలు చేయిస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే పవన్ ను ఓడించి పిఠాపురం నుండి తన్నితరిమేస్తామని... అలా చేయకుంటే తన పేరును పద్మనాభంరెడ్డిగా మార్చుకుంటానని సవాల్ చేసారని... ఆ కాన్సెప్ట్ ఏమిటో అర్థం కాలేదన్నారు. తన తండ్రి పవన్ కల్యాణ్ పై చేస్తున్న విమర్శలు ఆయన అభిమానులకే నచ్చడంలేదని క్రాంతి అన్నారు.
వైసిపిలో చేరారు కాబట్టి తమ పార్టీ అభ్యర్థి వంగా గీతను గెలిపించుకోడానికి తన తండ్రి పద్మనాభం ఎంతయినా కష్టపడవచ్చు... కానీ పవన్ కల్యాణ్ ను, ఆయన అభిమానులు కించపర్చేలా మాట్లాడటం తగదన్నారు. కేవలం పవన్ కల్యాణ్ ను తిట్టడానికే తన తండ్రిని జగన్ వాడుకుంటున్నారు... అవసరం తీరిపోయాక ఎటూ కాకుండా వదిలేస్తారని అన్నారు. పవన్ కల్యాణ్ విషయంతో తన తండ్రిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని అన్నారు. పిఠాపురంలో పవన్ గెలుపుకోసం తన వంతు కృషి చేస్తానని ముద్రగడ ఇంటి ఆడపడుచు క్రాంతి స్పష్టం చేసారు.
