ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం వాయిదా పడింది. అందరితో కలిసి కిర్లంపూడి నుంచి తాడేపల్లికి ర్యాలీగా వెళ్లాలని ఆయన అనుకున్నారు. కానీ, సెక్యూరిటీ కారణాల వల్ల ఈ నిర్ణయాన్ని ఆయన రద్దు చేసుకున్నారు. దీంతో చేరిక తేదీ కూడా వాయిదా పడింది. ఈ నెల 15 లేదా 16వ తేదీన తాను ఒక్కడే తాడేపల్లికి వెళ్లి వైసీపీలో చేరుతానని తాజాగా ఓ లేఖలో ముద్రగడ వెల్లడించారు.
కాపు సామాజిక వర్గ నాయకుడు ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు అండగా ఉంటారని భావించారు. కానీ, టీడీపీతో సీట్ల సర్దుబాటు విషయమై జనసేన పార్టీపై కాపు నాయకులు చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పుడు కాపు నేత ముద్రగడ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన వైసీపీ వైపు అడుగులు వేశారు. సీఎం జగన్ ఎంపీ మిథున్ రెడ్డిని ఆయన వద్దకు పంపారు. వైసీపీలోకి చేరడానికి ఆయన సుముఖత వ్యక్తం చేశారు.
వైసీపీలో చేరడానికి ఓ ముహూర్తం ఖరారైంది. మార్చి 14వ తేదీన ఆయన అభిమానులతో కలిసి పెద్ద ర్యాలీగా వెళ్లి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరే ప్లాన్ వేసుకున్నారు. ఆ మేరకు ఓ లేఖ కూడా రాసి అభిమానుల, శ్రేయోభిలాషులకు పిలుపు ఇచ్చారు. కిర్లంపూడి నుంచి తాడేపల్లి ర్యాలీగా వెళ్లాలని అనుకున్నారు. కానీ, సెక్యూరిటీ సమస్యలు ముందుకు రావడంతో ఆ నిర్ణయాన్ని రద్దు చేసుకున్నారు. తాజాగా ముద్రగడ మరో లేఖ రాశారు. సెక్యూరిటీ కారణాల వల్ల ర్యాలీ నిర్ణయాన్ని రద్దు చేసుకుంటున్నట్టు చెప్పారు. తాను ఒక్కడినే తాడేపల్లి వెళ్లి సీఎం జగన్ సమక్షంలో ఈ నెల 15 లేదా 16 తేదీల్లో వైసీపీలో చేరుతానని వివరించారు.
Also Read : Viveka Murder : సీఎం జగన్ నుంచి ప్రాణహాని.. సీబీఐ ప్రత్యేక కోర్టులో దస్తగిరి ప్రొటెక్షన్ పిటిషన్
వైసీపీలోకి అందరి ఆశీస్సులతో వెళ్లుదామని అనుకున్నా.. కానీ, ఊహించినదాని కన్నా భారీ స్థాయిలో స్పందన వచ్చింది. సెక్యూరిటీ ఇబ్బందుల వల్ల కూర్చోడానికి కాదు కదా.. నిలబడటానికి కూడా స్థలం సరిపోదు. ప్రతి ఒక్కరినీ చెక్ చేయడం ఇబ్బందికరం.. అని ముద్రగడ తాజా లేఖలో పేర్కొన్నారు. అందుకే అందరు కలిసి తాడేపల్లికి వెళ్లే నిర్ణయాన్ని రద్దు చేసుకున్నట్టు వివరించారు. అయితే.. వారందరి ఆశీస్సులు తన కు, జగన్ కు ఉండాలని కోరారు.