నందికొట్కూరు నియోజకవర్గంలోని పగిడాల మండలంలో తాసిల్దార్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు నగర శివార్లలోని  దిన్నెదేవరపాడు సమీపంలోని ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 

చెట్టుకు శవం వేలాడుతుండడంతో..... స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వాధీనపరచుకొని పోలీసులు మార్చురీకి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు సాగిస్తున్నారు. 

శ్రీనివాసులు ఐడెంటి కార్డు ఆధారంగా ఆయన్ని తహసిల్దార్ అని పోలీసులు గుర్తించారు. రాజకీయ ఒత్తిళ్లతో, లేక కుటుంబ కలహాలతో, లేక ఆరోగ్య కారణాల రీత్యా ఆత్మహత్య చేసుకున్నాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

పగిడ్యాల మండలంలో తహసీల్దార్ గా శ్రీనివాసులు సేవలందిస్తున్నప్పటికీ.... ఆయన కర్నూల్ బీ క్యాంపు లోని శ్రీ నగర్ కాలనీలో నివాసముంటున్నాడు. ఆయన ఆత్మహత్యకు ఇప్పటికిప్పుడు కారణం మాత్రం తెలియరాలేదు. 

శవాన్ని మార్చరీకి తరలించిన పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కుటుంబసభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆయన ఆత్మహత్యకు కారణం పూర్తి విచారణ పూర్తయిన తరువాత మాత్రమే చెప్పగలుగుతామని అంటున్నారు పోలీసులు. 

(ప్రజలెవ్వరూ కూడా డిప్రెషన్ కి గురి కావద్దు. అవసరమైతే డాక్టర్ల సలహాలు తీసుకోండి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేయండి. 040-66661117 నెంబర్ కి కాల్ చేయండి. వారు సహాయ సహకారాలు అందిస్తారు. ఐ కాల్ 9152987821, 040-66202001 , 040-66202000 ఈ నంబర్లకు కాల్ చేసి సహాయం పొందొచ్చు. ప్రాణం చాలా విలువైనది. ఎవ్వరు కూడా తమ ప్రాణాలను తీసుకొని బలవన్మరణానికి పాల్పడొద్దు.)